Telugu-woman-facing-problems-in-Gulf

మస్కట్‌లో చిక్కుకున్న హసీనా..సేట్ వద్దే పాస్‌పోర్టు, వీసా..

20 రోజులుగా భారత రాయబార కార్యాలయంలో చంద్రగిరి మహిళ


చంద్రగిరి, చిత్తూరు జిల్లా: జీవనోపాధి నిమిత్తం మస్కట్‌ వెళ్లిన హసీనా.. తిరిగి రాలేకపోతున్నారు. సేట్‌ ఇంటి వద్ద చిత్రహింసలు.. జీతం తక్కువగా ఇవ్వడంతో వెనుదిరిగారామె. పాస్‌పోర్టు, వీసా సేట్‌ వద్దే ఉండిపోవడంతో రాలేని పరిస్థితి. ప్రభుత్వం స్పందించి ఆమెను ఇండియాకు తీసుకు రావాలని బాధితురాలి తల్లి ఫ్యారీ, భర్త బాషీద్‌ కోరారు. ఈ మేరకు వీరు గురువారం చంద్రగిరిలో విలేకరులతో మాట్లాడారు. వీరు తెలిపిన ప్రకారం.. చంద్రగిరిలోని బీడీ వర్కర్స్‌ కాలనీకి చెందిన హసీనా జీవనోపాధి నిమిత్తం మస్కట్‌ వెళ్లారు. ఓ సేట్‌ ఇంటి వద్ద పనికి నెలకు రూ.25 వేల జీతం ఇస్తారని తమిళనాడు రాష్ట్రం విల్లుపురం మండలం కల్లుకుర్చికు చెందిన ఏజెంట్లు రాజా, అబ్దుల్‌ఖాదర్‌ ఆమెకు చెప్పారు. ఆ ప్రకారం గతేడాది అక్టోబరు 20వ తేదీన మస్కట్‌కు పంపారు. అక్కడ ఓఇంట్లో ఉదయం 5 నుంచి రాత్రి 12 గంటల వరకు పనిచేయించుకుంటూ నెలకు రూ.12 వేలే జీతం ఇస్తున్నారు.
 
దీంతో అక్కడ పనిచేయలేకపోయారు. ఐదు నెలలుగా ఆ ఇంట్లో హసీనా చిత్రహింసలు అనుభవిస్తూ 20 రోజుల కిందట మస్కట్‌లోని భారత రాయబారి కార్యాలయానికి చేరుకున్నారు. ఆమె పాస్‌పోర్ట్‌, వీసా సేట్‌ వద్దే ఉండటంతో ఇండియాకు రాలేకపోయారు. దీనిపై ఆమె తన కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వెంటనే హసీనా భర్త బాషీద్‌ ఏజెంట్లు అబ్దుల్‌ఖాదర్‌, రాజాలను కలిసి తన భార్యను ఇండియాకు తీసుకోవాలని కోరారు. రూ.40 వేలు తీసుకున్న వారు.. ఆమెను ఇండియాకు తీసుకొస్తామని నమ్మబలికారు. ఇంతవరకు సమాధానం ఇవ్వకుండా వారి సెల్‌ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉన్నారని బాధితులు ఆరోపించారు. దీనిపై తిరుపతి అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ప్రభుత్వం స్పందించి హసీనాను ఇండియా తీసుకు రావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.