Telugu-widow-woman-went-to-saudi-for-family

భర్త లేడు.. దిక్కుతోచక సౌదీకి.. వాషింగ్ మెషీన్ ఆన్ చేస్తుండగా..

మర్రిపాడు, సెప్టెంబరు 10 : భర్త చనిపోయాడు.. కుటుంబ భారం మీదపడింది.. దిక్కుతోచని స్థితిలో సంపాదన కోసం సౌదీవెళ్లింది.. అక్కడా ఆమెపట్ల విధి వక్రచూపే చూసింది.. విద్యుత్‌ ప్రమాదం రూపంలో ప్రాణాలు బలిగొంది. ఓ అభాగ్యురాలి విషాదగాథకు సంబంధించి వివరాలు.. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చాబోలు గ్రామానికి చెందిన గుండుబోయిన రమణమ్మ (40) కంపసముద్రం గ్రామానికి చెందిన రమణయ్యను పెళ్లి చేసుకుంది. వీరికి ముగ్గురు సంతానం. తొమ్మిదేళ్ల క్రితం డెంగ్యూ జ్వరంతో రమణయ్య మృత్యువాత పడటంతో కుటుంబ భారం రమణమ్మపై పడింది. రెండేళ్ల క్రితం ఓ ఏజెంట్‌ ద్వారా ఆమె సౌదీ వెళ్లింది. ఈ నేపథ్యంలో వాషింగ్‌ మెషిన్‌ ఆన్‌ చేస్తుండగా రమణమ్మ కరెంట్‌ షాక్‌కు గురై మృతి చెందినట్టు సోమవారం రాత్రి సౌదీ నుంచి ఫోన్‌లో తెలిపారని మృతురాలి అత్తమామలు వెంగయ్య, లక్షమ్మ తెలిపారు. తమ కోడలుమృతదేహాన్ని చివరిసారి చూసుకునేందుకైనా సహకరించాలని, ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

Related Articles