Telugu-student-death

వెస్టిండీస్‌లో తెలుగు విద్యార్థి మృతి..

  • జమైకాలో లోయలోకి జారిన స్కూల్‌ బస్‌
  • మృతుడు ప్రంజల్‌ది పశ్చిమ గోదావరి జిల్లా
ఆత్కూరు(ఉంగుటూరు), మే 22: జమైకాలోని పోర్ట్‌లాండ్‌ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రవాసాంధ్ర విద్యార్థి జాస్తి ప్రంజల్‌(13) మృతి చెందాడు. మరో 23 మంది విద్యార్థులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా చా టపర్రుకు చెందిన జాస్తి అశోక్‌ వైద్యుడు. 15 ఏళ్ల క్రితం వెస్టిండీస్‌ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అతని భార్య దివ్య గృహిణి. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు జాస్తి ప్రంజల్‌ పోర్ట్‌లాండ్‌ సమీపంలోని టిచ్‌ ఫీల్డ్‌ హైస్కూల్‌లో చదువుతున్నాడు. ప్రంజల్‌ ఈ నెల 20న స్కూలు నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటికి వస్తుండ గా అతడు ప్రయాణిస్తున్న స్కూలు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రంజల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్ట్‌మార్టం పూర్తయ్యాక నాలుగైదు రోజుల్లో ప్రంజల్‌ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువస్తామని అతడి పెదనాన్న జాస్తి ఆనంద్‌ తెలిపారు.  ఆత్కూరులో ప్రంజల్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు చెప్పారు.