Telugu-NRIs-Protest-Against-AP-Govt-Three-Capitals-Decision

అమరావతి కోసం అమెరికాలో ఎన్నారైల నిరసన

శాన్ ఫ్రాన్సిస్కో: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని కాదని మూడు చోట్ల రాజధానులను ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆలోచనను బే ఏరియాలోని ఎన్నారైలు తీవ్రంగా నిరసించారు. ఆంధ్రుల రాజధాని అమరావతి ఒక్కటేనని దానిని మార్చాలనుకోవడం దుర్మార్గమని వారు దుయ్యబట్టారు. అమరావతిలో రైతుల ఆందోళనకు వారు మద్దతు ప్రకటించారు. రైతులపై రాష్ట్ర ప్రభుత్వ దమనచర్యలను నిరసించారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని వారు ఈ సందర్భంగా నినదించారు. బే ఏరియాలోని మిల్‌పిటాస్‌లో ఉన్న స్వాగత్‌ రెస్టారెంట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంతోమంది ఎన్నారైలు పాల్గొన్నారు. ఎన్నారై టీడిపి నాయకుడు జయరామ్‌ కోమటి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. 

ఈ సందర్భంగా జయరామ్‌ కోమటి మాట్లాడుతూ.. అమరావతి నుంచి రాజధానిని తరలించాలనుకోవడం అవివేకమని అన్నారు. మూడు రాజధానులు అన్నది విఫల ప్రయోగమని చెప్పారు. అభివృద్ధిని అన్ని ప్రాంతాల్లో చేయాలి కాని, అధికార వికేంద్రీకరణ పేరుతో రాజధానిని మూడు చోట్లకు మార్చి ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. వైఎస్‌ జగన్‌ తుగ్లక్‌ పరిపాలన చేస్తున్నాడని దుయ్యబట్టారు. రాజధాని మార్పుపై అందరూ ఉద్యమించాల్సిన అవసరం ఉందని, అమెరికాతోపాటు, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు ఎన్నారైలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. శ్యామల మాట్లాడుతూ.. జగన్‌ నిర్ణయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ తాము అప్పటి ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో తమ భూములను అప్పగించామని, ఇప్పుడు జగన్‌ ఇక్కడి నుంచి రాజధానిని తరలించి తమ బతుకులను ఇబ్బందులపాలు చేస్తున్నాడని కన్నీళ్లు పెట్టుకున్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలించాలనుకోవడం అన్యాయమన్నారు. అమరావతిలోనే రాజధానిని పెట్టమని తాము ఎవరమూ కోరలేదని, ప్రభుత్వమే ఇక్కడ పెడుతున్నామంటే అంగీకరించామని చెప్పారు. చంద్రబాబు నాయుడి పరిపాలనదక్షతను గమనించి రాజధాని కోసం తాము కూడా దాదాపు 10 ఎకరాల భూమిని రాజధాని కోసం అప్పగించామని చెప్పారు. వైజాగ్‌ వాసులు కూడా జగన్‌ నిర్ణయంపై సంతోషంగా లేరని చెప్పారు.

చిత్తూరు జిల్లాకు చెందిన చేతన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ విభజన తరువాత తాము హైదరాబాద్‌ను కోల్పోయామని, అమరావతి రాజధానిగా ఏర్పడుతుందంటే సరేనని చెప్పామని, ఇప్పుడేమో వైజాగ్‌కు రాజధానిని తరలిస్తామంటే తాము ఒప్పుకోమని చెప్పారు. అమరావతి కోసం ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసుల చేత కొట్టించడం దారుణమన్నారు. మరో ఎన్నారై మహిళ విలేక్య మాట్లాడుతూ.. అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టకుండా జగన్‌ ప్రభుత్వం రాజధాని మార్పు వంటి చర్యలతో రాష్ట్రంలో సమస్యలను సృష్టిస్తోందన్నారు. పెద్ద గీత ముందు చిన్న గీత గీసి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరలిస్తున్నారని చెప్పారు. రైతులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తుంటే.. వారికి మద్దతుగా ఎంతోమంది మహిళలు కూడా వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తున్నారని చెప్పారు. పోలీసుల చేత ఈ ఆందోళనను అణచివేయాలని జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని,  రైతులు, మహిళలను ఇబ్బందులపాలు చేసిన ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. 

వెంకట్‌ కోగంటి మాట్లాడుతూ.. అతి తక్కువ వ్యవధిలోనే ఈ ఆందోళనకు పిలుపునిచ్చినప్పటికీ.. ఈ కార్యక్రమానికి దాదాపు 250 మంది ఎన్నారైలు రావడం సంతోషంగా ఉందని అన్నారు. జగన్‌ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి సమస్యల నుంచి దృష్టిని మరల్చేందుకే రాజధాని మార్పులు వంటివి చేస్తోందని విమర్శించారు. ఎన్నికలకు ముందు రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకువస్తామంటూ హంగామా చేసిన వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం.. ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదని, దానికితోడు సమస్యలను పరిష్కరించలేక ప్రజలను వీధులపాలు చేస్తోందని నిరసించారు. అమరావతిలోనే రాజధాని ఉండాలన్న రైతుల ఆందోళనకు ఎన్నారైలు పెద్దఎత్తున హాజరై మద్దతు పలకడం ఆనందంగా ఉందన్నారు. ప్రాంతాల మధ్య రాజధాని పేరుతో చిచ్చు పెట్టాలన్న జగన్‌ ప్రయత్నాన్ని ప్రజలంతా కలిసి తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. 

కాగా.. ఈ కార్యక్రమంలో జయరామ్‌ కోమటి, వెంకట్‌ కోగంటి, శ్యామల, విజయ గుమ్మడి, ఎంవి రావు, గాంధీ పాపినేని, రాజా కొల్లి, ప్రసాద్‌ మంగిన, వీరు ఉప్పల, జే ప్రసాద్‌ వేజేళ్ళ, భక్తబల్లా, రజనీకాకర్ల, రామ్‌ తోట, కోనేరు శ్రీకాంత్‌, శ్రీని వల్లూరిపల్లి, సతీష్‌, భాస్కర్‌ వల్లభనేని, హేమంత్‌, శ్రీకాంత్‌ దొడ్డపనేని, బాబు ప్రత్తిపాటి, గోకుల్‌, భరత్‌ ముప్పిరాల, సతీష్‌ బొర్రా, చేతన, శిరీష, యశ్వంత్‌ కుదరవల్లి, రెడ్డయ రమేష్‌, శ్రీనివాస్‌ పోతినేని, భాస్కర్‌ వల్లభనేనిలతోపాటు దాదాపు 250 మందికిపైగా ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.