Telugu-Man-Gets-Rs-1.24-Crore-Per-Annum-in-Amazon

అమెజాన్‌లో జాక్‌పాట్ కొట్టిన తెలుగు యువకుడు.. భారీ వేతనంతో కొలువు

కృష్ణా జిల్లా యువకుడి ఘనత

ముదినేపల్లి: అతనిది గ్రామీణ ప్రాంతం.. అయితేనేం తన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అమెజాన్‌ కంపెనీలో ఏడాదికి రూ.1.24 కోట్ల వేతనంతో ఉద్యోగం సాధించాడు. కృష్ణాజిల్లా చెన్నూరు గ్రామానికి చెందిన బుద్దా గోపాలకృష్ణమూర్తి, సత్యసులోచన దంపతుల కుమారుడు బుద్దా కార్తీక్‌ ముదినేపల్లిలోని లిటిల్‌ ఫ్లవర్‌ స్కూలులో చదువుకున్నాడు. హైదరాబాద్‌ బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. అనంతరం రూ.15లక్షల వార్షిక వేతనంపై హైదరాబాద్‌లోని క్వాల్‌కమ్‌ మల్టీనేషనల్‌ కంపెనీలో చేరాడు. రెండేళ్ల తర్వాత రాజీనామా చేసి అమెరికా వెళ్లిపోయాడు. అక్కడ కంప్యూటర్‌ సైన్స్‌ మెషిన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో ఎంఎస్‌ పూర్తి చేశాడు. ఇటీవల రూ.1.24 కోట్ల వేతన ప్యాకేజీపై అమెరికాలోని అమెజాన్‌ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దీనిపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.