Telugu-man-deceived-to-watch-over-camels-in-Gulf

మంచి ఉద్యోగమంటే లక్ష కట్టి గల్ఫ్ వెళ్లిన యువకుడు.. తీరా అక్కడికి వెళ్లిన తరువాత..

  • సరైన తిండి లేక గల్ఫ్‌లో యువకుడి అవస్థ
  • పోలీసుల సాయంతో భర్తను కాపాడిన భార్య
  • నెలన్నర చెర నుంచి జగిత్యాల వాసికి విముక్తి
(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మంచి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెంట్‌ చెబితే రూ.లక్ష కట్టి గల్ఫ్‌కు వచ్చాడా యువకుడు. ఇక్కడేమో అతడిని ఓ అరబ్‌ వ్యక్తి దగ్గర పనికదుర్చి.. ఒంటెలను కాసే బాధ్యతను అప్పజెప్పారు. సరైన తిండిలేదు. కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి తన గోడునంతా వెళ్లబోసుకుందామన్నా సిగ్నల్స్‌ పని చేయని చోటు అది. ఇలా నెలన్నరగా సౌదీలో అష్టకష్టాలు పడుతున్న ఓ యువకుడికి ఎట్టకేలకు ఆ చెర నుంచి విముక్తి లభించింది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వల్లంపల్లికి చెందిన ఎల్లల కృష్ణ అనే యువకుడిని గల్ఫ్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని అదే గ్రామానికి చెందిన జీవన్‌రెడ్డి అనే దళారి నమ్మించాడు. కృష్ణను సికింద్రాబాల్‌లో ఏజెన్సీ నిర్వహిస్తున్న లీలావతి అనే మహిళ దగ్గరకు తీసుకెళ్లి కృష్ణతో ఆమెకు రూ.లక్ష కట్టించాడు.

 

కాగా సౌదీలో దిగగానే కృష్ణకు సమస్యలు ఎదురయ్యాయి. అతడిని బిషా అనే పట్టణానికి తీసుకెళ్లారు. అక్కడ ఒంటెలను కాసే పనిని అప్పజెప్పారు. తాను మోసపోయానని, ఇక్కడ తిండికి అలమటిస్తున్నానని భార్య కల్యాణికి చెప్పుకొని కృష్ణ బాధపడ్డాడు. ఏజెంట్‌ను కల్యాణి నిలదీయడమే కాకుండా ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో లీలావతిపై ఉచ్చు బిగిసింది. గల్ఫ్‌ సామాజిక కార్యకర్త దొంతుల శివాజీ సాయాన్ని అర్థించగా కృష్ణ విషయాన్ని భారత రాయబార కార్యాలయ అధికారుల దృష్టికి ఆయన తీసుకెళ్లారు. కాగా ముంబైలోని ప్రధాన ఏజెంట్లతో లీలావతి మాట్లాడి కృష్ణను సౌదీ నుంచి వెనక్కిపంపించాల్సిందిగా కోరగా అరబ్‌ యజమాని అంగీకరించాడు. మంగళవారం కృష్ణను ఇక్కడి నుంచి స్వదేశానికి పంపారు.