Telugu-Man-Dead-Body-in-Gulf-for-3-Months

పనిచేస్తున్నచోట తెలుగు వ్యక్తి మృతి.. 3 నెలలుగా గల్ఫ్‌లోనే మృతదేహం.. ఆవేదనలో బాధిత కుటుంబం

పనిచేస్తున్నచోట విద్యుదాఘాతంతో మృతి..

పోస్టుమార్టం ఆలస్యం..
ఆవేదనలో బాధిత కుటుంబం
(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బతుకుదెరువు కోసం గల్ఫ్‌ వచ్చిన తెలంగాణ వాసి తాను పనిచేస్తున్న చోట ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు! ఇది జరిగి మూడు నెలలైంది. మృతదేహాన్ని ఇంకా స్వదేశానికి తరలించలేదు. కుటుంబసభ్యులేమో సరైన తిండి, నిద్ర లేకుండా మృతదేహం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. నిర్మల్‌ జిల్లా దివాలపూర్‌ మండలం సిర్గాపూర్‌ గ్రామానికి చెందిన చందాల కడిలె చందు కుటుంబసభ్యులదీ గాథ. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని పంపాలంటూ బాధిత కుటుంబసభ్యులు లేఖ రాయడమే ఈ జాప్యానికి కారణమని తెలుస్తోంది. సౌదీలోని నజ్రాన్‌ నగరానికి 300 కిలోమీటర్లలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో చందు పనిచేసేవాడు. అక్కడే గత జూన్‌లో తన గది వద్ద విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. చందుతో కలిసి పనిచేస్తున్న సాయన్న స్వదేశంలోని బాధిత కుటుంబసభ్యులకు విషయాన్ని తెలిపాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తమకు అప్పగించాలని భారత రాయబార కార్యాలయ అధికారులను చందు భార్య హేమలత కోరింది. ఈ మేరకు పోస్టుమార్టం నిర్వహించాలని సౌదీ అధికారులను రాయబార కార్యాలయ అధికారులు కోరారు.  
అయితే, ఇక్కడ పోస్టుమార్టం ప్రక్రియ భారత్‌ తరహాలో కాదు. కేసులో ఎక్కడైనా ఏదైనా అనుమానాలుంటే ఈ ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతుంది. పోలీసులు, పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ అధికారులు, ఫోరెన్సిక్‌ విభాగాల మధ్య పోస్టుమార్టం కోసం కుటుంబసభ్యులు పంపిన విజ్ఞాపన పత్రం చక్కర్లు కొడుతోంది. పైగా పోస్టుమార్టం నివేదికను వైద్యులు నేరుగా రాయబార కార్యాలయ అధికారులకు గానీ మృతుల కుటుంబాలకు గానీ ఇవ్వరు. తమ న్యాయశాఖకు అందిస్తారు. దీనికి నెలల తరబడి సమయం పడుతుంది. కాగా తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సిఫారసుతో తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసినా ఈ విషయంలో తామేమీ చేయలేమని ఎంబసీ అధికారులు స్పష్టం చేశారు. ఆ తర్వాత తమకు పోస్టుమార్టం అవసరం లేదని పేర్కొంటూ మృతుడి భార్య మరో లేఖ పంపినప్పటికీ అప్పటికే సౌదీ హోం శాఖకు పోస్టుమార్టం కోసం ఫైలును నివేదించారు. ఇప్పుడు దాన్ని మార్చేవీలు లేదు. విచారణ జరిగి, పోస్టుమార్టం నివేదికను అధ్యయనం చేసిన తర్వాత గానీ చందు మృతదేహాన్ని అప్పగించే ఆవకాశం లేదు. ఇందుకు మరికొన్ని నెలలు పట్టొచ్చు.