Telangana-man-in-Sharjah-jail-for-almost-20-yrs

రెండు దశాబ్దాలుగా.. జీవచ్ఛవంలా.. జైల్లోనే తెలంగాణవాసి..

  • షార్జా జైల్లో తెలంగాణ దళితుడి ఘోష
  • క్షణికావేశంతో కటకటాలపాలైన బుచ్చన్న
  • రూ.3 లక్షలిస్తే జైలు నుంచి విముక్తి
  • అంత స్థోమత లేని పేద కుటుంబం
(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)
పొట్ట కూటి కోసం పరాయి దేశానికి వెళ్లాడు.. 20 ఏళ్ల వయసులో షార్జా చేరుకున్నాడు.. అక్కడ జరిగిన ఘర్షణలో క్షణికావేశంతో కటకటాలపాలయ్యాడు.. 19 ఏళ్లుగా కారాగారంలోనే మగ్గిపోతున్నాడు.. ఇదీ జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం కొత్తపేటకు చెందిన దళితుడు దరూరి బుచ్చన్న దీనగాథ. బతుకుదెరువు కోసం బుచ్చన్న 2001లో షార్జా వెళ్లాడు. అక్కడ తనతో కలిసి ఉంటున్న నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం ముక్పాల్‌కు చెందిన బి.గోవర్ధన్‌తో గొడవ పడ్డాడు. ఆ ఘర్షణలో గోవర్ధన్‌ మరణించాడు. స్థానిక న్యాయస్థానం బుచ్చన్నకు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి అతను జైల్లోనే ఉన్నాడు. ప్రస్తుతం అతని మానసిక పరిస్థితి బాగాలేదని, మాట్లాడలేని స్థితికి చేరాడని సమాచారం.
 
షార్జా జైల్లో ఉన్న భారతీయులందరిలోనూ బుచ్చన్న దయనీయ పరిస్థితుల్లో ఉన్నాడు. వాస్తవానికి ఇతనికి సులువుగా విడుదలయ్యే అవకాశం ఉంది. కానీ, ఎవరూ పట్టించుకోకపోవడంతో జైల్లోనే ఉండిపోయాడు. గల్ఫ్‌ చట్టాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు క్షమించినట్లుగా ప్రకటిస్తే.. శిక్షను రద్దు చేస్తారు. ఈ విధానాన్ని ‘తనజ్జుల్‌’ అంటారు. ఇలా తెలుగువారి కేసుల్లో ఇతర దేశాలు, చివరికి పాకిస్థాన్‌ నుంచి కూడా బాధిత కుటుంబాల తనజ్జుల్‌ తీసుకొని జైలు నుంచి విడుదలైన వారూ ఉన్నారు.
భూమి, రూ.3 లక్షలు ఇవ్వలేక..
పదేళ్ల కిందట శ్రామికశక్తి కార్మిక సంఘం నేత పి.నారాయణస్వామి.. బుచ్చన్నను విడిపించేందుకు ప్రయత్నించారు. మృతుడు గోవర్ధన్‌ భార్య రాధ తమకు రూ.3 లక్షల పరిహారం, ప్రభుత్వం నుంచి వ్యవసాయ భూమి, ఇళ్ల స్థలం కేటాయిస్తే బుచ్చన్నను క్షమిస్తున్నట్లుగా లేఖ ఇస్తానని ప్రతిపాదించింది. కూలీ, గ్రామ సుంకరిగా పనిచేసే బుచ్చన్న సోదరులు తమకు అంత స్థోమత లేదని నిస్సహాయత వ్యక్తం చేశారు. దీంతో బుచ్చన్నను విడిపించే ప్రయత్నం ఆగిపోయింది. అతని తల్లి ఇప్పటికీ కొడుకు కోసం అల్లాడిపోతోంది.
 
పట్టించుకోని ప్రభుత్వాలు, సంఘాలు..
క్రీడాకారులకు నగరాల్లో ఉదారంగా స్థలాలు కేటాయించే ప్రభుత్వాలు.. ఒక పల్లెటూరుకు చెందిన నిరుపేద కుటుంబానికి మాత్రం స్థలం ఇవ్వకపోవడం గమనార్హం. ఆ కుటుంబానికి స్థలం ఇస్తే మరో పేద దళితుడ్ని కాపాడినట్లవుతుంది. అలాగే గల్ఫ్‌లో పండుగలు, వేడుకలకు విరాళాలు సేకరించే సంఘాలు, నాయకులు రూ.3 లక్షల విషయంలో మౌనంగా ఉన్నారు. దళిత హక్కుల కోసం ఉద్యమించే సంఘాలు కూడా బుచ్చన్న లాంటి నిరుపేదల సమస్యలపై స్పందించకపోవడం గమనార్హం. కడప జిల్లాకు చెందిన సురేశ్‌.. కువైత్‌లో మలయాళీ చేతిలో మరణిస్తే కేరళ ప్రజలు రూ.10 లక్షలు పోగు చేసి సురేశ్‌ భార్యకు ఇచ్చి మలయాళీని విడిపించుకున్నారు. నాటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కింది సురేశ్‌ భార్యకు రూ.5 లక్షలు అందజేశారు. ఆ స్ఫూర్తి మన తెలుగువారిలోనూ కనిపిస్తే బాగుంటుంది.