Teen-killed-her-best-friend-after-man-she-met-online-offered-millions

‘63 కోట్లిస్తా ఎవర్నైనా చంపేయ్’ అనడంతో..

అలస్కా: ఆన్‌లైన్లో పరిచమైన ఓ మోసగాడి మాటలు నమ్మిందా అమ్మాయి. అతనిస్తానన్న కోట్ల రూపాయలకు ఆశపడి.. మానసిక వికలాంగురాలైన బెస్ట్‌ఫ్రెండ్‌ని దారుణంగా చంపేసింది. ఈ హత్యలో ఆమెకు మరో నలుగురు మిత్రులు సాయం చేశారు. అమెరికాలోని అలస్కాలో జరిగిన ఈ దారుణం 19 ఏళ్ల సింథియా హాఫ్‌మన్ కుటుంబాన్ని విషాదంలో ముంచింది. కొన్ని రోజుల క్రితం డెనాలీ బ్రెహ్‌మెర్ అనే ఓ 18 ఏళ్ల అమ్మాయికి ఆన్‌లైన్లో డారిన్ షిల్‌మిల్లర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఎవరినైనా చంపి ఆ చిత్రాలు తనకు సోషల్ మీడియాలో పంపితే 90 లక్షల డాలర్లు (దాదాపు రూ.63 కోట్లు) ఇస్తానని చెప్పాడు. అతని మాటలు నమ్మిన డెనాలీ మరో నలుగురు మిత్రులతో కలిసి సింథియాను హతమార్చడానికి పథకం వేసింది.

సింథియా మానసికంగా ఎదగకపోవడంతో ఆమెను టార్గెట్ చేసుకున్నట్లు వారు చెప్పారు. హైకింగ్‌కు వెళ్తున్నట్లు కుటుంబసభ్యులకు చెప్పిన వారు.. ఓ మిత్రుడి కారు తీసుకొని సింథియాను తమతో తీసుకెళ్లారు. మార్గమధ్యంలో దారి మార్చి నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అక్కడ డక్ట్‌టేప్‌తో సింథియా కాళ్లు చేతులు కట్టేసి ఫొటోలు తీసి డారిన్‌కు పంపించారు. అనంతరం తుపాకీతో సింథియా తలలో కాల్చారు. మృతదేహాన్ని నదిలో పారేసిన వారు.. సింథియా ఫోన్‌తో ఆమె కుటుంబ సభ్యులకు తాను మధ్యలో కారు దిగేసినట్లు మెసేజ్‌లు పెట్టారు. ఆ తర్వాత డబ్బు కోసం డారిన్‌ను సంప్రదించగా.. తన వద్ద అంత సొమ్ములేదని అతను చేతులెత్తేశాడు. దాంతో అతను మోసగాడని వారికి అర్థమైంది. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఐదుగురు నిందుతులతోపాటు, దీనంతటికీ మూలకారణమైన డారిన్‌ను కూడా అరెస్టు చేశాడు. నిందితులందరినీ తమ కూతురు ‘బెస్ట్‌ఫ్రెండ్స్’ అని చెప్పిందని, వారంతా కలిసి అన్యాయంగా తమ కుమార్తెను చంపేశారని సింథియా కుటుంబం కన్నీటిపర్యంతమైంది.