Tatipilliwasi-died-while-being-treated-in-Mascot

మస్కట్‌లో చికిత్స పొందుతూ తాటిపల్లివాసి మృతి

- స్వగ్రామం చేరిన మృతదేహం

మల్యాల, మే 14:ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదం బారినపడి చికిత్స పొందుతూ మరణించాడు. మృతదేహాన్ని మంగళవారం స్వగ్రామానికి చేర్చారు. వివరాల్లోకి వెళ్తే.. మల్యాల మండలం తాటిపల్లికి చెందిన దుంపాల గంగారెడ్డి ఏడు సంవత్సరాలుగా ఉపాధి కోసం మస్కట్‌ దేశం వెళ్లొచ్చేవాడు. రెండేళ్ల క్రితం మరోసారి మస్కట్‌ వెళ్లిన గంగారెడ్డి.. 20రోజుల క్రితం అక్కడ బల్దియాలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయాలయ్యాయి.. అతను కోమాలోకి వెళ్లాడు. చికిత్సపొందుతూ 15రోజుల అనంతరం మృతి చెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం తెలిసింది. కాగా మృతదేహాన్ని మంగళవారం స్వదేశానికి తీసుకువచ్చారు. హైదరాబాద్‌లోని ఏయిర్‌పోర్టు నుంచి ప్రభుత్వ సహకారంతో సోషల్‌ వర్కర్‌, గల్ఫ్‌ బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ చాంద్‌ పాషా అంబులెన్స్‌ ఏర్పాటు చేసి మతదేహాన్ని తాటిపల్లికి పంపించారు.