Swimmer-died-while-training

సాధన చేస్తూ కుప్పకూలిన.. ప్రపంచస్థాయి స్విమ్మర్

హాంగ్‌కాంగ్: ఒలింపిక్స్‌లో పతకం గెలవాలని పట్టుదలతో సాధన చేస్తున్న హాంగ్‌కాంగ్ స్విమ్మర్ కెన్నెత్ టో హటాత్తుగా మరణించాడు. హాంగ్‌కాంగ్‌కు చెందిన కెన్నెత్ కుటుంబం, అతని చిన్నతనంలోనే ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే స్థిరపడింది. దాంతో ఆస్ట్రేలియా తరఫున ప్రపంచస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో కెన్నెత్ పాల్గొన్నాడు. 2010లో జరిగిన యూత్ ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా తరఫున 6 పతకాలు సాధించాడు. 2013లో జరిగిన ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల పోటీలో ఆస్ట్రేలియా తరఫున రజత పతకం సాధించిన బృందంలో సభ్యుడు. ఇటీవలే కెన్నెత్ కుటుంబం మళ్లీ హాంగ్‌కాంగ్ చేరుకుంది. దాంతో తన పౌరసత్వాన్ని కూడా కెన్నెత్ మార్చుకున్నాడు. వచ్చే ఒలింపిక్స్‌లో ఎలాగైనా హాంగ్‌కాంగ్ తరఫున పతకం గెలవాలని పట్టుదలగా సాధన చేస్తున్నాడు. ఏమైందో తెలియదుగానీ సోమవారం సాధన మధ్యలో ఉండగా తనకు ఒంట్లో బాలేదంటూ కెన్నెత్ కుప్పకూలిపోయాడు. దాంతో విపరీతంగా కంగారుపడిన అక్కడి నిర్వాహకులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకొంటూ కెన్నెత్ మరణించాడు. అతని మృతికి కారణాలేంటో ఇంకా తెలియరాలేదు. దీనిపై పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు.