Suspicious-Wife-face-Trial-in-UAE-Court-for-Checking-Cheating-Husband-Phone

భర్త మొబైల్‌లో అసభ్యకర సందేశాలు.. వాటిని చూసిన భార్యకు కోర్టులో షాక్..

రాస్ అల్ ఖైమా: యూఏఈలో ఒకరి గోప్యతను ఆక్రమించడం శిక్షార్హమైన నేరం. చివరకు కట్టుకున్న భార్య అయిన భర్త అనుమతి లేకుండా అతడి గోప్యత విషయంలో జోక్యం చేసుకోవడానికి వీలులేదు. రాస్ అల్ ఖైమాలో ఓ వివాహిత తన భర్తపై అనుమానంతో అనుమతి లేకుండా అతడి మొబైల్ చూడడం.. అందులోని సమాచారాన్ని తన ఫోన్‌లోకి మార్చుకోవడం చేసింది. దీంతో ప్రస్తుతం ఆమె రాస్ అల్ ఖైమా కోర్టులో విచారణ ఎదుర్కొంటోంది. విచారణలో తన నేరాన్ని అంగీకరించిన ఆమె.. భర్త తనను మోసం చేసి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని వాదించింది. ఈ విషయం భర్త మొబైల్‌లో ఉన్న సందేశాల వల్ల తనకు తెలిసిందని వివరించింది. అలాగే భర్త ఫోన్ నుంచి తీసుకున్న టెక్ట్స్ మెసెజ్లను న్యాయవాది ముందు ఉంచింది. కాగా, భర్త అనుమతి లేకుండా అతడి మొబైల్ సందేశాలను తస్కరించడం.. భర్త గోప్యతకు భంగం కలిగిండమేనని అతడి తరఫు న్యాయవాది వాదించారు. ఆర్టికల్ 378 ప్రకారం పురుషుడి గోప్యతను ఆక్రమించడం శిక్షార్హమైన నేరమని.. మహిళను కఠినంగా శిక్షించాలని కోర్టుకు లాయర్  విన్నవించారు. 

ఇక యూఈఏ చట్టాల ప్రకారం ఇతరుల అనుమతి లేకుండా వారి గోప్యతను హరించడం నేరం.. దీనికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. కాగా, వివాహిత తరఫు న్యాయవాది తన క్లయింట్ భర్తతో గత తొమ్మిదేళ్లుగా సఖ్యతతో కాపురం చేస్తూ అతడ్ని ఆనందంగా ఉంచుతుందని తెలిపారు. అయినా భర్త ఆమెను మోసం చేసి వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం నేరమని చెప్పారు. భర్తకు హనీ తలపెట్టాలని అతడి మొబైల్ చూడలేదని, పలుమార్లు అతడు అనుమానాస్పదంగా వ్యవహరించడం, ఆ సమయంలో అనుమానం వచ్చి అతడి అనుమతితోనే ఫోన్ చూసినట్లు వివరించారు. అదే సమయంలో భర్తకు నిత్యం పరాయి మహిళల నుంచి ఫోన్ కాల్స్, అసభ్యకర సందేశాలు రావడం ఆమె అనుమానాన్ని ఇంకా పెంచిందని, దాంతో అతడి అనుమతి లేకుండా మొబైల్ సందేశాలు చూసిందని తెలిపారు. అసభ్యకరంగా ఉన్న ఆ సందేశాలను రుజువుగా చూపేందుకే తన క్లయింట్ వాటిని తన ఫోన్‌లోకి మార్చుకున్నట్లు కోర్టుకు న్యాయవాది విన్నవించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తుది తీర్పును జూలై 17వ తేదీకి వాయిదా వేసింది.