stock-up-for-12-years-

12 ఏళ్లకు ఖాళీ అయిన స్టాక్.. అదేంటో తెలిస్తే..

బెర్లిన్: జర్మనీలోని ఫుచస్తల్‌ నగరంలో ఎట్టకేలకు 12 ఏళ్ల తరువాత టాయిలెట్ పేపర్ స్టాక్‌ ఖాళీ అయ్యింది. దీనిని 2006లో నగర అధికారులు కొనుగోలు చేశారు. అప్పట్లో పొరపాటున అత్యధిక సంఖ్యలో టాయిలెట్ పేపర్‌కు ఆర్డర్ చేశారు. దీంతో ఈ స్టాక్‌ను 12 ఏళ్ల పాటు వినియోగించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే జర్మనీలోని బ్రేవెరియా ప్రాంతంలోని కుచస్తల్ నగర అధికారులు 2006లో రెండు ట్రక్కుల టాయిలెట్ పేపర్‌కు ఆర్డర్ చేశారు. దీనికి సంబంధించిన మొదటి ట్రక్కు రాగానే, అధికారులకు తమ పొరపాటు తెలిసివచ్చింది. దీంతో రెండో ట్రక్కు ఆర్డర్‌ను క్యాన్సిల్ చేశారు. ఈ నగరంలో కేవలం 4 వేల జనాభా మాత్రమే ఉంది. దీంతో ఈ ఆర్డర్ చాలా అధికమని తేలింది. రెండవ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసిన తరువాత కూడా భారీ మొత్తంలో టాయిలెట్ పేపర్ స్టాక్ మిగిలిపోయింది. దీనికి తోడు స్థానికులు కూడా ఈ పేపర్ క్వాలిటీ చూసి దానిని వినియోగించేందుకు విముఖత చూపారు. దీంతో అధికారులు ఈ టాయిలెట్ పేపర్‌ను పెద్ద‌ పెద్ద గోదాములలో నిల్వ ఉంచాల్సి వచ్చింది. దీనితో పాటు స్కూళ్లు తదితర ప్రాంతాలలో ఈ టాయిలెట్ పేపర్‌ను ఉంచారు. అదే విధంగా నలుగురు అధికారుల బృందం ఇంటింటికీ వెళ్లి ఈ టాయిలెట్ పేపర్‌ను పంపిణీ చేసింది. ఈ ఉదంతంపై పట్టణ మేయర్ ఇర్వన్ క్రగ్ మాట్లాడుతూ ‘మేము టాయిలెట్ పేపర్ మీద అయ్యే ఖర్చులో 855 డాలర్లను ఆదాచేయగలిగాం. ప్రతీయేటా టాయిలెట్ పేపర్ ధర పెరిగిపోతోంది. గతం నుంచి ఒక గుణపాఠం నేర్చుకున్నాం. ఈసారి కూడా టాయిలెట్ పేపర్ కోసం ఆర్డర్ చేశాం. అయితే అంతపెద్ద మొత్తంలో చేయలేదని’ తెలిపారు.