Starving-Whale-dies-In-Philippines

ఆకలితో మరణించిన తిమింగలం.. పొట్టకోసి చూస్తే షాక్

మబీని: ప్లాస్టిక్ వాడకం వల్ల నీళ్లలో జీవించే జంతువుల ప్రాణాలు బలవుతున్నాయి. ప్రపంచంలోనే సముద్రాన్ని ఎక్కువగా పొల్యూట్ చేస్తున్న దేశంలో ఫిలిప్పిన్స్ మొదటి స్థానంలో ఉంది. ఆ దేశస్థులు ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయకపోవడం వల్ల అదంతా సముద్రంలో చేరుతోంది. ఈ కారణంగా సముద్ర జీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి. తాజాగా ఫిలిప్పిన్స్‌లో ప్లాస్టిక్ కారణంగా ఓ తిమింగలం మరణించింది. శుక్రవారం మబీని నగరంలో ఒడ్డున పడివున్న తిమింగలాన్ని చూసిన జాలర్లు దాన్ని తిరిగి సముద్రంలోకి పంపించారు. ఈదుకుంటూ కూడా వెళ్లలేని స్థితిలో తిమింగలం ఉంది. కొద్ది సేపటికి తిమింగలం మరణించింది. ఆసుపత్రిలో తిమింగలానికి పరీక్షలు జరిపించగా.. ఆకలి కారణంగా చనిపోయినట్టు తేల్చారు. ఈ వార్త విని అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. తిండి వెళ్లడానికి వీలు లేకుండా లోపల 40 కేజీల ప్లాస్టిక్ అడ్డుగా ఉండిపోయిందని డాక్టర్లు చెప్పారు. దీంతో ప్రతి ఒక్కరూ ఆవేదన చెందారు. ఇంత దారుణంగా సముద్రజీవి చనిపోవడం ఇదే మొదటిసారి చూస్తున్నామని డాక్టర్లు తెలిపారు. కాగా, ఇలాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా చాలానే జరుగుతున్నాయి. గతేడాది థాయ్‌ల్యాండ్‌లో 80 ప్లాస్టిక్ బ్యాగులు మింగడం ద్వారా ఓ తిమింగలం మరణించింది.