Sriramanavami-celebrations-in-Gulf

గల్ఫ్‌లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి: ఒమన్‌లో శనివారం సీతారామ కల్యాణ మహోత్సవం వైభవంగా, భద్రాదిలో జరిగినట్లు జరిగింది. ఈ వేడుకలను వీక్షించేందుకు మస్కట్‌, సలాల, సోహేర్‌, రాస్‌ అల్‌ఖైమాల నుంచి తెలుగు రాష్ర్టాల భక్తులు తరలివచ్చారు. కల్యాణ క్రతువును తిలకించి ఆనందించారు. భారత్‌లో ఆదివారం సీతారాముల కల్యాణం నిర్వహించనుండగా ఇక్కడ మాత్రం ఒకరోజు ముందే నిర్వహించడం విశేషం. మస్కట్‌లోని ప్రముఖ ప్రవాసాంధ్రులయిన చందన రాందాస్‌, వెంకట్‌, మధుసూదన్‌ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. వారాణసీ నుంచి ప్రత్యేకంగా మస్కట్‌కు వచ్చిన కె.దత్తాత్రేయ శర్మ నేతృత్వంలో వేద పండితులు పూజలు చేశారు. 110 సంవత్సరాల చరిత్ర కలిగిన మస్కట్‌లోని కృష్ణ మందిర్‌ ఆలయంలో గత కొన్నాళ్లుగా సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. రామనవమి సందర్భంగా నవరాత్రులను కూడాఘనంగా నిర్వహిస్తారు.