Sneakers-Filled-With-Holy-Water-Sell-Out-In-Minutes

రూ. 2 లక్షలు విలువచేసే వస్తువు.. కొనేందుకు ఎగబడిన కస్టమర్లు

వాషింగ్టన్: దేవుడుకు సంబంధించిన వస్తువులంటే రూపాయి ఎక్కువైనా సరే వెనుకాడకుండా చాలా మంది కొనేస్తూ ఉంటారు. అమెరికాలో తాజాగా ఇలానే ఓ వస్తువును ఆన్‌లైన్‌లో పెట్టిన నిమిషాల్లోనే అవి హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయి. ఇంతకీ ఆ వస్తువు ఏంటంటే.. నైకీ షూ కంపెనీకి చెందిన ఎయిర్‌ మ్యాక్స్ 97 షూస్. ఈ షూస్‌ను సేల్‌కు పెట్టిన నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిపోయాయి. అంతలా ఈ షూస్‌లో ఏముందంటారా..  

ఈ షూస్‌ను తయారుచేసిన ఎమ్‌ఎస్‌సీహెచ్‌ఎఫ్, యూఎస్‌పీ సంస్థలు వీటికి ‘జీసస్ షూస్’ అని పేరు పెట్టారు. ఈ షూస్‌ సోల్‌లో పవిత్రమైన జోర్డన్ నది నీరు ఉంటుంది. పైనున్న ఫొటోను గమనిస్తే.. షూ సోల్‌లో నీలం రంగులో నీరు కనపడుతుంది. అంతేకాకుండా బైబిల్‌లో జీసస్ నీళ్లపై నడిచాడు అనే  మ్యాథ్యూ 14:25 వాక్యాన్ని కూడా షూపై రాశారు. వీటితో పాటు జీసస్ రక్తానికి చిహ్నంగా షూపైన చిన్న రక్తపు బొట్టును కూడా పెట్టారు. ఇక షూ స్ట్రిప్స్‌పై జీసస్ శిలువను ఏర్పాటుచేశారు. ఇన్ని రకాలుగా తయారుచేసిన షూస్‌ను మతాన్ని ప్రేమించే ఏ ఒక్కరైనా దక్కించుకోవాలనే అనుకుంటారు కదా. అందుకేనేమో ఈ షూస్‌ను సేల్‌కు పెట్టగా.. ఆ షూస్‌ను ఎలాగైనా దక్కించుకోవాలని వేల మంది ఆత్రుతపడ్డారు. మొదటగా చాలా తక్కువ సంఖ్యలోనే ఈ షూస్‌ను తయారుచేశామని సంస్థ చెప్పింది. త్వరలోనే మరో నూతన మోడల్‌తో ముందుకొస్తామని షూ తయారుచేసిన సంస్థ అధినేత గాబ్రియేల్ తెలిపారు.