Small-Mistake-Telugu-Man-gets-22-Months-Sentence-in-Saudi

చిన్న పొరపాటు.. 22 నెలలుగా తెలుగు యువకుడు సౌదీ జైల్లో దుర్భర జీవితం.. చివరకు

22 నెలలుగా జైల్లో దుర్భర జీవితం..

ఎట్టకేలకు స్వగ్రామానికి
సుభాష్‌నగర్(నిజామాబాద్): బతుకుదెరువు కోసం గల్ఫ్‌ దేశానికి వెళ్లి.. అక్కడి యజమాని ఆగ్రహానికి గురై 22నెలల పాటు జైలు పాలైన యువకుడు ఎట్టకేలకు సొంత ఊరు చేరుకున్నాడు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌కు చెందిన రాకేష్‌ 2016 డిసెంబరులో సౌదీ అరేబియా వెళ్లి, ఓ షూ కంపెనీలో పనికి కుదిరాడు. 4 నెలల తర్వాత పొరపాటున ఓ మతానికి వ్యతిరేకంగా కామెంట్‌ను సోషల్‌ మీడియాలో పెట్టాడు. దీంతో న్యాయస్థానం 2017 సెప్టెంబరులో రాకేష్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 15రోజుల తర్వాత రాకేష్‌ ఫోన్‌ ద్వారా తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కొడుకు జైలు జీవితం గడుపుతున్నాడని తెలిసి రాకేష్‌ తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. రాకేష్‌ తల్లి ఇక్కడి అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ గతంలో కథనాన్ని ప్రచురించింది. దీంతో గల్ఫ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బసంత్‌రెడ్డి స్పందించి రాకేష్‌ కుటుంబసభ్యులను తీసుకొని జూలై 12న ఢిల్లీకి వెళ్లి అక్కడ భారత రాయబారిని కలిసి సౌదీలో ఉన్న లాయర్‌తో మాట్లాడించి.. క్షమాభిక్ష ప్రసాదింపజేశారు. అనంతరం ఇక్కడి సుప్రీంకోర్టు లాయర్‌ శ్రవణ్‌ సహాయంతో.. సోమవారం రాత్రి రాకేష్‌ తన స్వగ్రామమైన పెర్కిట్‌కు వచ్చాడు.