Shocking-Past-of-Govandi-Beggar-Who-Died-in-Train-Accident

ముంబైలో చనిపోయిన బిచ్చగాడు.. మా తండ్రి మస్కట్ రిటర్న్ అంటూ పోలీసులను కలిసిన కుమారులు

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని గోవండి రైల్వే స్టేషన్ వద్ద బిర్భిచంద్ ఆజాద్(62) అనే బిచ్చగాడు శుక్రవారం రాత్రి రైలు పట్టాలు దాటుతుండగా ట్రైన్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో స్థానికుల సమాచారం ద్వారా అక్కడికి చేరుకున్న పోలీసులకు ఆజాద్ దగ్గర చిల్లర డబ్బుతో పాటు బ్యాంకు పాస్ బుక్కులు దొరికాయి. అనంతరం అతడు నివాసముంటున్న గుడిసెకి వెళ్లి చూస్తే పెద్ద మొత్తంలో చిల్లర నాణేలు కనిపించాయి. చిల్లర నాణెలన్నీ బకెట్లు, సంచుల్లో నింపి పెట్టాడు ఆజాద్. ఆ చిల్లర లెక్కించడానికి 8 గంటలకు పైగానే పట్టింది. ఆ చిల్లర మొత్తం విలువ రూ. 1.77 లక్షలుగా తేలింది.

అలాగే వేర్వేరు బ్యాంకుల్లో ఫిక్డ్స్‌ డిపాజిట్ రూపంలో రూ. 8 లక్షల 77వేలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలా ఆజాద్ మొత్తం రూ.10 లక్షలు కూడబెట్టాడు. ఇక బిర్బిచంద్‌ది రాజస్థాన్ అని అతడి వద్ద దొరికిన ఆధార్ కార్డు ద్వారా పోలీసులకు తెలిసింది. బిర్బిచంద్ చాలా ఏళ్ల కిందటే ముంబైకి వచ్చి బిచ్చమెత్తుకుని జీవనం సాగిస్తున్నాడని స్థానికులు తెలిపారు. దీంతో రైల్వే పోలీసులు అతని కుటుంబ సభ్యులు గానీ, బంధువులు గానీ రాజస్థాన్‌లో ఉంటే వారికి అతడి నగదుతో పాటు వస్తువులను అప్పగిస్తామని చెప్పారు. 

ఈ మేరకు రాజస్థాన్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ పోలీసులు ఇచ్చిన ప్రకటన చూసిన అతడి ఐదుగురు కుమారులు మంగళవారం ముంబై వచ్చారు. అనంతరం వాషి రైల్వే పోలీసులను కలిసి బిర్భిచంద్ తమ తండ్రి అని, అతడి మృతదేహాంతో పాటు నగదు తమకు అప్పగించాలని కోరారు. ఈ సందర్భంగా బిర్బిచంద్‌‌ గతాన్ని కూడా వారు పోలీసులకు వివరించారు. 1977లో తమ తండ్రి  బేల్దారి పని కోసం మస్కట్ వెళ్లినట్టు వారు పేర్కొన్నారు. అక్కడ రెండేళ్ల పాటు బేల్దారి పని చేసి బాగా సంపాదించి తిరిగి ఇండియాకి వచ్చిన ఆయన స్వస్థలానికి మాత్రం రాలేదన్నారు. అప్పటి నుంచి కొన్నేళ్లు అతడి కోసం వెతికిన ఆచూకీ దొరకలేదన్నారు. అలాగే ఒకసారి ఆయన పక్కింటి వారితో గొడవ కారణంగా జైలుకు కూడా వెళ్లి వచ్చాడని వారు తెలిపారు. తమ తండ్రి సాధువుల్లో కలిసిపోయి ఉండొచ్చని అనుకున్నామని, కానీ బిచ్చగాడిగా బతికాడంటే మాత్రం నమ్మలేకపోతున్నామన్నారు.

అంతేగాక తమ తండ్రి సర్‌నేమ్ ఆజాద్ కాదని వారు తెలిపారు. ఇక తమ వద్ద వచ్చిన ఆజాద్ ఐదుగురు కొడుకులను సుఖ్దేవ్రామ్, రాజ్‌కుమార్, ధరంపాల్, సర్జీత్, సవార్మల్‌గా రైల్వే పోలీసులు పేర్కొన్నారు. అందరీ కంటే చిన్నవాడైన సవార్మల్‌తో పాటు రాజ్‌కుమార్ కూడా ముంబైలోనే నివాసముంటున్నట్లు గుర్తించారు. ఓ ప్రైవేటు కంపెనీలో సవార్మల్‌ సూపర్ వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మిగతా ముగ్గురు కుమారులు రాజస్థాన్‌లోనే ఉంటున్నారు. ఈ ఐదుగురి ద్వారా ఆజాద్ గతం గురించి తెలుసుకున్న పోలీసులు ఈ కేసును జాగ్రత్తగా విచారిస్తున్నారు. రూ.10 లక్షలు కూడబెట్టిన బిర్భిచంద్ నామినీగా మాత్రం పెద్ద కొడుకు పేరు మాత్రమే పేర్కొన్నాడని పోలీసులు వెల్లడించారు.