shark-dragged-fishing-boat-full-of-people-around-San-Francisco-Bay

చేపలు పట్టడానికి వెళ్లిన కుర్రాళ్లు.. పడవ లాక్కెళ్లిన సొరచేప..

శాన్‌ఫ్రాన్సిస్కో: ఇదేదో జాస్ సినిమాలో సీన్ అనుకోకండి. ఇది నిజంగానే జరిగింది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఈ ఘటన జరిగింది. ఇక్కడి శాన్‌ఫ్రాన్సిస్కో బేలో చేపలు పట్టడానికి వెళ్లారు కొందరు ఔత్సాహికులు. చిన్న పడవలో వెళ్లిన వారు.. ఓ చోట లంగరు వేసి చేపలు పట్టడం మొదలెట్టారు. కాసేపటికి వారి అదృష్టమో దురదృష్టమో తెలియదుగానీ ఓ గ్రేట్ వైట్‌షార్క్ వారి గాలానికి చిక్కింది. దాదాపు ఏడడుగులున్న ఆ చేప లంగరు వేసి ఉన్నా కూడా.. వారి పడవను సముద్రంలో లాక్కెళ్లింది. దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లాక గాలం విడిపోవడంతో వారిని విడిచిపెట్టింది. ఈ ప్రాంతంలో షార్క్ చేపలుండటం అరుదు. దాంతో తొలుత దీన్ని డాల్ఫిన్ అనుకున్న పడవలోని వారు.. బలవంతంగా చేపను పైకి లాగబోయారు. దాంతో నీటిపైకి వచ్చిన సొరచేపను చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఆ బృందం దీనికి సంబంధించిన వీడియోను ఫేస్‌‌బుక్‌లో పంచుకొంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.