shamshabad-airport-modernisation

2 కోట్ల మంది ప్రయాణికులు

2018-19పై శంషాబాద్‌ విమానాశ్రయం అంచనా

మూడేళ్లలో విస్తరణ పనులు పూర్తి
అంతర్జాతీయ డిపార్చర్‌ టెర్మినల్‌ ప్రారంభం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ (ఆర్‌జీఐఎ) విస్తరణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. మరో మూడేళ్లలో ఈ విస్తరణ పనులు పూర్తవుతాయని జిఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (జీహెచ్‌ఐఎఎల్‌) ప్రధాన కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) ఎస్‌జికె కిశోర్‌ తెలిపారు. విదేశాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఎయిర్‌పోర్టులో కొత్తగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ డిపార్చర్‌ టెర్మినల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కిశోర్‌ ఈ విషయం ప్రకటించారు. విస్తరణ పనులు పూర్తయితే వార్షిక ప్రయాణికుల నిర్వహణ సామర్ధ్యం ప్రస్తుత స్థాయి నుంచి రెట్టింపవుతుందన్నారు. ‘గత ఆర్థిక సంవత్సరం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి 1.8 కోట్ల మంది రాకపోకలు సాగించారు. ఈ సంవత్సరం అది రెండు కోట్లకు చేరనుంది. మరో మూడేళ్లలో విస్తరణ పూర్తయ్యే సరికి ప్రయాణికుల వార్షిక నిర్వహణ సామర్ధ్యం 3.4 కోట్ల నుంచి నాలుగు కోట్ల మధ్య ఉంటుంది’ అన్నారు.

బుధవారం ప్రారంభించిన అంతర్జాతీయ డిపార్చర్‌ టెర్మినల్‌ ఈ నెల 23 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ విమానాశ్రయం నుంచి ప్రయాణించే ప్రయాణికుల వార్షిక వృద్ధి రేటు, గత మూడేళ్లలో వరసగా 20 శాతానికంటే ఎక్కువగా ఉందని కిశోర్‌ తెలిపారు. అత్యాధునిక సదుపాయాలతో రూ.50 కోట్ల పెట్టుబడితో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ టెర్మినల్‌ ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకునేందుకు వీలుగా పూర్తిగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ నిర్మాణ సామాగ్రితో అంతర్జాతయ టెర్మినల్‌ ఏర్పాటు చేసినట్టు కిశోర్‌ చెప్పారు. పెరిగే ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఎయిర్‌పోర్టులో అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిఎంఆర్‌ గ్రూపు ఎయిర్‌పోర్ట్స్‌ విభాగం బిజినెస్‌ చైర్మన్‌ జిబిఎస్‌ రాజు ప్రకటించారు.

 
రెండేళ్లలో ముఖ గుర్తింపుతో ప్రవేశాలు
దేశంలోని విమానాశ్రయాలు, విమానాల్లో ప్రయాణికుల ప్రవేశ, బోర్డింగ్‌కు సంబంధించి వచ్చే రెండేళ్లలో సమూల మార్పులు రాబోతున్నట్టు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్‌ చౌబే ప్రకటించారు. ‘ప్రయాణికుల ముఖ గుర్తింపు, మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ వివరాల ఆధారంగా ఈ పనులు జరుగుతాయి. తనిఖీల్లోనూ మానవ ప్రమేయం ఉండదు. అన్ని తనిఖీలు యంత్రాల ద్వారా జరిగి పోతాయి’ అన్నారు. గత నాలుగేళ్లలో మన దేశంలో ఉన్నంత విమాన ప్రయాణికుల వృద్ధి రేటు ప్రపంచంలో మరే దేశంలోనూ లేదు. ‘గత 15 నెలల్లోనూ ఈ వృద్ధి రేటు కొనసాగింది. చైనాతో పోలిస్తే మన వృద్ధి రేటు 40 శాతం ఎక్కువ’ అని చౌబే చెప్పారు.
 
నెలాఖర్లో ఎయిర్‌ ఇండియా ఉద్దీపన ప్యాకేజి
ఎయిర్‌ ఇండియాను ఆదుకునేందుకు ఉద్దీపన ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరులోగా ఖరారు చేసే అవకాశం ఉందని చౌబే చెప్పారు. అవసరాల ఆధారంగా ఎయిర్‌ ఇండియాకు ప్రభుత్వ సాయం కొనసాగుతుందన్నారు. ‘ఈ ప్యాకేజీని దాదాపుగా ఇప్పటికే ఖరారు చేశాం. బహుశా ఈ నెలాఖర్లో ఈ వివరాలు ప్రకటిస్తాం. కాబట్టి ఎయిర్‌ ఇండియాకు ఎలాంఇ సమస్య ఉండదు’ అన్నారు. ఎయిర్‌ ఇండియా స్థూల ఆర్థిక పరిస్థితులు, మార్కెట్‌ పరిస్థితులు మెరుగు పడే వరకు పెట్టుబడుల ఉపసంహరణకు అవకాశం లేదన్నారు. అప్పటి వరకు అవసరాన్ని బట్టి ఎయిర్‌ ఇండియాను ఆదుకోక తప్పదన్నారు.