Sensational-secrets-in-Chicago-Sex-rocket

చికాగో సెక్స్ రాకెట్‌లో మొత్తం వెయ్యి మంది!

రెగ్యులర్‌ విటులు వందకు పైనే.. చెల్లింపుల జాబితాలో వెల్లడి

వంద మందికి సమన్లు.. మోదుగుమూడి దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్‌, జూలై 11(ఆంధ్రజ్యోతి): అమెరికాలో సంచలనం సృష్టించిన మొదుగుమూడి కిషన్‌ సెక్స్‌ కుంభకోణంలో దర్యాప్తు వేగం పుంజుకుంది. మొదుగుమూడికి చెల్లింపులు చేసిన వారిని అమెరికా దర్యాప్తు అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటిదాకా వందమందికి పైగా నోటీసులు అందుకున్నారు. వీరిని అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీఅధికారులు తమ కార్యాలయాలకు పిలిపించి విచారిస్తున్నారు. ‘‘నాకు తెలిసిన ఒక వ్యక్తికిహోంల్యాండ్‌ సెక్యూరిటీ ఏజెంట్లు నోటీసులు పంపారు. న్యాయవాది సలహా మేరకు శుక్రవారం అధికారుల ముందు హాజరయ్యాడు. తాను ఒక సినీనటితో ఎప్పుడు గడిపిందీ, ఆమెకు ఎంత చెల్లించిందీ? ఏ క్రెడిట్‌ కార్డుపై చెల్లించిందీ? మొదలైన సమాచారం అంతా ఇచ్చాడు. ఇలా నోటీసులు అందుకున్న వాళ్లు వందమందికి పైగా ఉన్నారు’’ అని ఈ కేసును దగ్గర నుంచి పరిశీలిస్తున్న ఒక వ్యక్తి తెలిపారు. మొదుగుమూడి వ్యవహారంలో అమెరికా దర్యాప్తు ఏజెంట్లు కొన్ని లెడ్జర్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిలో దాదాపు వెయ్యి మందికి పైగా విటుల పేర్లు ఉన్నాయి. వీరిలో వందమందికి పైగా మొదుగుమూడితో తరచూ సంప్రదింపులు జరుపుతూ ఉండేవారు. వీరందరికీ నోటీసులు జారీ చేశారు. వీరి వాంగ్మూలాలను నమోదు చేసుకుంటున్నారు.
 
కేసు జ్యూరీకే
అమెరికా చట్టాల ప్రకారం తమ కేసును జడ్జి, జ్యూరీల్లో ఎవరు విచారించాలనేది నిందితులు ఎంచుకోవచ్చు. మొదుగుమూడి తన కేసును జ్యూరీ విచారించాలని కోరుకున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ‘‘సాధారణంగా జడ్జీలు ఈ కేసును న్యాయపరంగానే చూస్తారు. జ్యూరీలో వివిధ వర్గాలకు చెందిన వారు ఉంటారు. వారు మొదుగుమూడి వాదనను మానవీయ కోణం నుంచి వినే అవకాశం ఉంటుంది. అందువల్లే మొదుగుమూడి జ్యూరీ కావాలని కోరుకొని ఉండవచ్చు’’ అని ఈ కేసులతో సంబంధం ఉన్న ఒక న్యాయవాది వెల్లడించారు. ఈ కేసులో మొదుగుమూడి దంపతులకు పెద్దగా శిక్ష పడే అవకాశం లేదనేది న్యాయవర్గాల భావన. ‘‘అమెరికాలో వ్యభిచారాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించరు. మానవ అక్రమ రవాణా మాత్రం పెద్ద నేరం. ప్రస్తుతం మొదుగుమూడిపై పెట్టిన కేసు ఇదే. కేసు విచారణలో ఉన్న సమయంలో ఆయన దర్యాప్తుకు సహకరిస్తే శిక్ష తగ్గించే అవకాశం లేకపోలేదు. పెట్టిన కేసు ప్రకారం మొదుగుమూడి దంపతులకు ఐదు వేల డాలర్ల దాకా జరిమానా, ఐదేళ్ల దాకా జైలు శిక్ష పడవచ్చు. ఇప్పటికే జైలులో ఉన్నారు కాబట్టి ఆ శిక్షా కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు’’ అని ఆ న్యాయవాది వెల్లడించారు.
 
డబ్బులన్నీ భారత్‌కే
మొదుగుమూడి దంపతులు సంపాదించిందంతా ఆంధ్రాలో ఉన్న తమ బినామీలకు పంపేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. మొదుగుమూడి దంపతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని, బెయిల్‌కు కూడా డబ్బుల్లేవని ఇటీవల వారి తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఇది ఒక విధంగా నిజమేనని, ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఫిబ్రవరిలో అరెస్ట్‌ చేసిన తర్వాత వారు తమ క్లయింట్లకు ఫోన్లు చేసి వెయ్యి, పదిహేను వందల డాలర్ల చొప్పున వసూలు చేశారని ఈ కేసు పూర్వాపరాలు తెలిసిన ఒక అధికారి వెల్లడించారు. ‘‘జనవరిలో వారిని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఫిబ్రవరిలో వారిని బెయిల్‌ మీద విడుదల చేశారు. తర్వాత వారు దాదాపు వందమందికి ఫోన్లు చేశారు. త్వరలోనే ఒక హీరోయిన్‌ అమెరికా వస్తోందనే ఆశ చూపించి 1000-1500 డాలర్ల చొప్పున అడ్వ్డాన్స్‌ తీసుకున్నారు. అంతకు ముందు వారు సంపాదించిన సొమ్ము ఏమయిందనే విషయం తెలియదు’’ అని ఆ అధికారి వెల్లడించారు. చాలామంది దగ్గర మొదుగుమూడి దంపతులు డాలర్లు తీసుకొనేవారని, అలా సంపాదించిన మొత్తమేమయిందో తెలియదని ప్రముఖ తెలుగు అసోషియేషన్‌ సభ్యుడు శ్రీనివాస్‌ వెల్లడించారు. ‘‘మా లెక్కల ప్రకారం ఒకో హీరోయిన్‌ లేదా యాంకర్‌ నెల రోజుల్లో 25 నుంచి 30 లక్షలు సంపాదించి ఉండాలి. అంతే మొత్తాన్ని మొదుగుమూడి కూడా సంపాదించాడు. ఇలాంటి వారు మొదుగుమూడి దగ్గర కనీసం ఐదుగురు ఉన్నారనుకుందాం. అంటే ఏడాదికి అతని సంపాదన పదికోట్లకు పైనే. ఇలా రెండేళ్లు సంపాదించాడనుకుందాం. అంటే కనీసం ఇరవై కోట్లు సంపాదించాలి. ఈ మొత్తమంతా ఇండియాకు పంపేసి ఉండాలి. లేకపోతే ఇప్పుడు మొదుగుమూడి దంపతులు అంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఏముంది?’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
- స్పెషల్‌ డెస్కు