Sarath-death-in-America-due-to-Part-time-job

డాలర్‌ కంట్రీలో దడదడ

అమెరికాలో ప్రమాద స్థాయికి చేరుతున్న గన్‌కల్చర్‌

భారతీయులపై కాల్పులతో విరుచుకుపడుతున్న విద్రోహులు
ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు

బంజారాహిల్స్‌, హైదరాబాద్, జూలై 10(ఆంధ్రజ్యోతి): విదేశాల్లో ఉన్నత విద్య.. మంచి ఉద్యోగం.. విలాసవంతమైన జీవితం.. డాలర్ల సంపాదన భారతీయ యువత కలల స్వప్నం. దశాబ్దాలు మారినా విదేశీ విద్య మోజు విషయంలో మార్పు లేదు. అమెరికా వీసా జారీలో ఎన్ని కఠిన నిబంధనలను అమలు చేసినా వాటిని ఒపికగా అధిగమించేందుకే యువకులు మొగ్గు చూపిస్తున్నారు. ముఖ్యంగా బీటెక్‌ పూర్తి చేసిన ప్రతి పది మందిలో ఏడుగురు అమెరికాకు వెళ్లేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే అమెరికా లాంటి అబివృద్ధి చెందిన దేశాల్లో గన్‌కల్చర్‌ పెరిగిపోవడం తల్లిదండ్రులను ఆవేదనకు గురిచేస్తోంది. అమెరికాలో చదువుకునే విద్యార్థు లు ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు చేస్తున్న పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు వారికి ప్రాణసంకటంగా మారుతున్నాయి. జాతి వివక్షకు లోనవుతున్న విద్రోహులు గన్‌తో రెచ్చిపోతున్నారు. బహిరంగంగానే కాల్పులు జరుపుతూ విద్యార్థులను పొట్టనపెట్టుకుంటున్నారు. అమెరికాలో ఉద్యోగం చేయడం కఠినమైన పనిగా మారిపోయిందని ఐటీ నిపుణులు చెబుతున్నారు. 
 
ప్రాణాలమీదకు తెస్తున్న పార్ట్‌టైమ్‌ ఉద్యోగం..
అమెరికాలో ఉన్నత విద్య చదివేందుకు వెళుతున్న విద్యార్థులకు పనిచేసేందుకు వెసులు బాటు ఉండదు. చదువుతున్న విశ్వవిద్యాలయంలోనే వైస్‌ చాన్సిలర్‌ అనుమతితో లైబ్రరీ లేక కంప్యూటర్‌ విభాగంలో పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. ఇదంతా విశ్వవిద్యాలయం నిర్వాహకుల అనుమతితోనే సాధ్యమవుతుంది. అయితే ఇలా పనిచేసే విద్యార్థులకు ఫీజుల మేర కూడా డబ్బు రాదు. ఇక అక్కడ ఉండటానికి, అన్నపానీయాలకు చాలానే డబ్బు అవసరమవుతుంది. వీటికోసం కుటుంబంపై ఆర్థిక భారం వేయడం ఇష్టంలేక కొంతమంది విద్యార్థులు అనధికారికంగా పా ర్ట్‌టైం ఉద్యోగాలు చేస్తుంటారు. గ్యాస్‌స్టేషన్‌, షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్‌లు, బార్‌లలో పనిచేసి వచ్చిన డబ్బుతో ఖర్చులు వెళ్లదీస్తుంటారు.
 
విద్వేషాల ఫలితం..

 పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలే వారికి ప్రాణసంకటంగా మారుతున్నాయి. భారతీయ విద్యార్థుల కారణంగా తమకు ఉద్యోగం రావడం లేదని కక్ష్య పెంచుకుంటున్న విద్రోహులు దాడులు, దోపిడీలు చేయడం వంటివి చేస్తున్నారు. విజయవాడకు చెందిన నరేష్‌ అనే విద్యార్థి గ్యాస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. నల్లజాతీయుడు గన్‌ చూపించి బెదిరించి అతని వద్ద డబ్బు దోచుకున్నాడు. కాని గ్యాస్‌స్టేషన్‌ నిర్వాహకుడు మాత్రం దోపిడీ డబ్బుమొత్తం నరేష్‌ వద్ద నుంచే వసూ లు చేశాడు. దీంతో విజయవాడలో ఉన్న అతని కుటుంబంపై ఆర్థికభారం పడింది. వారు కొంత స్థలాన్ని అమ్మి డబ్బు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

హైదరాబాద్‌ అమీర్‌పేటకు చెందిన జాహ్నవి అనే విద్యార్థిని షాపింగ్‌మాల్‌లో పనిచేస్తోంది. కొంత మంది యువకులు గన్‌ చూపి ఆమెను బెదిరించి కౌంటర్‌లో ఉన్న డబ్బుతో పారిపోయారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డు కావడంతో యజమాని జాహ్నవిని డబ్బు అడగకపోయినప్పటికీ ఉద్యోగం నుంచి తొలగించాడు. నాటినుంచి జాహ్నవి, ఆమె స్నేహితులు పార్ట్‌టైమ్‌ జోలికి వెళ్లలేదు. ఉద్యోగానికి దూరంగా ఉండటమే మేలని విదేశీ  కన్సల్టెన్సీ నిర్వహించే నవాబ్‌ చెబుతున్నారు. ముఖ్యంగా నల్లజాతీయులతో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని అంటున్నారు. పార్ట్‌టైమ్‌ జాబ్‌ కష్టతరమైనదిగా మారిందని పేర్కొన్నారు. 
 
కాల్పులతో విరుచుకుపడుతున్నారు...
  • 2017 ఫిబ్రవరి 25న నగరానికి చెందిన  శ్రీనివాస్‌ కూచిభొట్ల దుండగులు కాల్పుల్లో మరణించాడు. అతను స్నేహితులు, భార్యతో కలిసి రెస్టారెంట్‌లో  ఉండగా ముగ్గురు దుండగులు జరిపిన కాల్పుల్లో మరణించాడు. 
  • మీర్‌పేటకు చెందిన అక్బర్‌ చికాగోలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. 2017 డిసెంబర్‌ 10న తన క్వార్టర్‌లోని పార్కింగ్‌ కేంద్రంలోనుంచి కారు తీస్తుండగా అమెరికన్‌తో గొడవ జరిగింది. దీంతో అతను రెచ్చిపోయి ఇక్కడ బతకడానికి వచ్చి నాతోనే గొడవ పడతావా అంటూ తీవ్రంగా కొట్టా డు. అనంతరం గన్‌తో కాల్చాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అక్బర్‌ మరణించాడు.
  • అమీర్‌పేటకు చెందిన శరత్‌ కొప్పు ఎంఎస్‌ చదివేందుకు అమెరికా వెళ్లాడు. క్యాన్సా్‌సలోని ఓ రెస్టారెంట్‌లో పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు. 2018, జూలై 7న గుర్తు తెలియని వ్యక్తులు రెస్టారెంట్‌ పై ఒక్కసారి కాల్పులతో విరుచుపడ్డారు. ఈ ఘటనలో శరత్‌కొప్పు తుటాలు తగిలి మృతి చెందాడు.
 
కోలుకోవడానికి సమయం పడుతుంది 
విదేశాల్లో ఉన్న బిడ్డలు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి మృతదేహాలు భారత్‌కు తీసుకువచ్చేందుకు నాలుగు నుంచి వారం రోజులు పడుతుంది. బిడ్డల ఆఖరి చూపుల కోసం ఎదురుచూసి కన్నతల్లి పూర్తి డిప్రెషన్‌ స్టేజీకి వెళ్లిపోతుంంది. కుటుంబ సబ్యులను ఓదార్చాలా, మృతదేహాన్ని ఎలా తెప్పించాలి.. అని తండ్రి మనోవేదనకు చెందుతుంటాడు. ఈ కారణంగా అతనిలో పూర్తి శక్తి నశించి ఆలోచించే శక్తినికూడా కోల్పోతారు. ఇలాంటి తల్లిదండ్రులను తిరిగి మామూలు చేసేందుకు మానసిక నిపుణులతో కౌన్సెలింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది. వారి పడే ఆవేదన తీర్చడం ఎవరి తరం కాదు. 
- డా. నరేష్‌ వడ్లమాని, సైకియాట్రిస్ట్‌