Sad-story-of-an-NRI

ఉన్నత స్థాయి నుంచి దీనస్థితికి.. పాపం.. ప్రవాసీ!

  • ఉన్నత స్థాయి నుంచి దీనస్థితికి.. ‘మీ సేవ’కు ఆద్యుడు ఆయనే
  • ఉన్నతి కోసం దుబాయ్‌కు
  • సొంత వ్యాపారంలో తీవ్ర నష్టాలు
  • ఆర్థిక కష్టాలకు తోడు కబళిస్తున్న కేన్సర్‌ 
  • గుంటూరు ఎన్నారై దీనగాథ
  • అతికష్టం మీద నేడు స్వదేశానికి
(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)
ఆశల ఆకాశంలో అవకాశాలను వెతుక్కుని మెరుపులు సృష్టించిన నిత్య కృషీవలుడు ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ‘మీ సేవ’ సాఫ్ట్‌వేర్‌కు శ్రీకారం చుట్టి ప్రభుత్వ సేవలను ప్రజల చెంతకు చేర్చింది మొదలు దుబాయ్‌లో ఈఆర్‌పీ సేవల వరకు సాఫ్ట్‌ వేర్‌ రంగంలో ఒక వెలుగు వెలిగిన నిత్య చైతన్య స్ఫూర్తి ఆయన. అయితే, విధి బలీయం అన్న మాట ఆయన జీవితంలో అక్షరాలా నిజమైంది. దుబాయ్‌కి వెళ్లి మరిన్ని వెలుగులు సృష్టించాలనుకున్న ఆయన జీవితం ఒక్కసారిగా నేలమట్టమైంది. సొంత వ్యాపారంలో తీవ్ర నష్టాలు, ఆర్థికంగా చితికిపోవడం, ఆఖరుకు ఇంటి అద్దె కట్టుకోలేని స్థితి, వీసాను రెన్యువల్‌ చేయించుకునే పరిస్థితి లేని వైనంతో అనేక అగచాట్లు పడ్డారు. ఇంతలోనే శరీరాన్ని కేన్సర్‌ మహమ్మారి ఆవహించింది. పరిస్థితిని గమనించిన ఒకరిద్దరు చేసిన సాయంతో అత్యంత దీనస్థితిలో ఉన్న ఆయన గురువారం స్వదేశానికి చేరుకోనున్నారు. ఆయనే రాజధాని జిల్లా గుంటూరు నగరానికి చెందిన 52 ఏళ్ల నేలపాటి విలియమ్స్‌.
కేసుల సంకెళ్లు..
కేన్సర్‌ కారణంగా విషమిస్తున్న విలియమ్స్‌ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా, స్వదేశంలోని అతని కుటుంబ సభ్యల వద్దకు చేర్చాలని దుబాయి వైద్యులు సూచించారు. దీంతో ఆయన మిత్రులు భారతదేశానికి పంపిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, ఇంతలోనే విలియమ్స్‌ కేసుల సంకెళ్లలో బందీగా ఉన్నారనే విషయం వెలుగు చూసింది. ఇంటి అద్దెకుగాను ఇచ్చిన రెండు చెక్కులు బౌన్స్‌ కావడంతో బ్యాంకు పోలీసు కేసు పెట్టింది. అదేసమయంలో రెసిడెన్స్‌ వీసా రెన్యువల్‌ చేసుకోకుండా మూడేళ్లుగా అక్రమంగా నివసిస్తున్నందున దుబాయి ప్రభుత్వం కూడా ఆయనపై కేసు నమోదు చేసింది. సుమారు 30 వేల దిర్హామ్‌ జరిమానా విధించింది. దీంతో విలియమ్స్‌ పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో విలియమ్స్‌ మిత్రులు భారత కాన్సులేట్‌ను సంప్రదించి విలియమ్స్‌ పరిస్థితిని వివరించి సాయం కోసం అభ్యర్థించారు. ఈ క్రమంలో కాన్సులేటు అభ్యర్థన మేరకు దుబాయి ప్రభుత్వం జరిమానాను మాఫీ చేసినట్లు దుబాయిలోని ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్‌ వి.అనురాధ తెలిపారు. ఇక, బ్యాంకు కేసు విషయానికి వస్తే.. చెక్కు బౌన్స్‌కు గాను వడ్డీ మరియు జరిమానాలతో సహా బ్యాంకుకు 98 వేల దిర్హామ్‌లు(సుమారు రూ.18.5 లక్షలు), ఆసుపత్రి బిల్లు 30 వేల దిర్హామ్‌లు (సుమారు రూ.6 లక్షలు) చెల్లిస్తే గానీ స్వదేశానికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో విలియమ్స్‌ దీనస్థితిని గమనించిన దుబాయిలోని ఇస్లామిక్‌ బ్యాంకు అధికారి అహ్మద్‌ అల్‌ షంసీ జరిమానాను మాఫీ చేసి బ్యాంకు పక్షాన పోలీసు కేసును ఉపసంహరించుకున్నారు. బిల్లు విషయంలో ఆసుపత్రి కూడా ఉదారంగా వ్యవహరించింది. దీంతో విలియం స్వదేశానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. 
మూలిగే నక్కపై.. 
ప్రభుత్వ సేవలను సామాన్యుల చెంతకు చేర్చే ‘మీ సేవ’ ప్రాజెక్టు రూపకల్పనలో విలియ మ్స్‌ కీలక పాత్ర పోషించారు. అయితే, మరింత ఉన్న తి కోసం ఆయన 2014లో దుబాయికు పయనమయ్యా రు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం చేసి తర్వాత సొంత వ్యా పారం ప్రారంభించారు. అయితే, ఈ వ్యాపారంతో ఆయన తీవ్రంగా నష్టపోయారు. ఇంటి అద్దె నిమిత్తం చెల్లించిన రెండు బ్యాంకు చెక్కులు బౌన్స్‌ కావడంతో విలయమ్స్‌పై దుబాయి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో ఆయన తన బతఖా (రెసిడెన్సీ వీసా)ను రెన్యువల్‌ చేయించుకోలేకపోయారు. ఫలితంగా 2016 నుంచి అక్కడే అక్రమంగా నివాసముంటున్నారు. అయినా తన ఆర్థిక పరిస్థితిని ఎవరికీ చెప్పకుండా అంతర్మథనం చెందారు. అలా ఉంటూనే దుబాయిలోని కొంత మంది తెలుగు వారి సంస్థలకు ఐటీ సేవలందిస్తున్నారు. మరోవైపు ఆజ్మాన్‌లోని తన ఇంట్లో విలియమ్స్‌ కాలుజారి కిందపడ్డారు. మిత్రులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించగా పరీక్షల్లో విలియమ్స్‌కు కేన్సర్‌ వ్యాధి ప్రమాదకర స్థాయిలో ఉందని వైద్యులు నిర్ధారించారు.