sad-end..-mallika-was-died

పాపం.. మల్లిక కన్నుమూసింది.. కువైట్‌ నుంచి ఎముకల గూడులా తిరిగొచ్చి..

(ఆంధ్రజ్యోతి): బతుకుదెరువు కోసం కువైట్‌ వెళ్లి అక్కడి ఓ సేఠ్‌ ఇంటిలో అష్టకష్టాలు పడి అనారోగ్యంతో ఎముకలగూడులా మారి ఎలాగోలా సొంతూరు చేరుకున్న మల్లిక పాపం చివరికి ప్రాణాలు కోల్పోయింది. కువైట్‌ వెళ్లాక మూడేళ్లు గడిచినా ఒక్కసారి కూడా ఆమె సొంతూరికి రాలేకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఏజంట్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల జోక్యంతో డిసెంబర్‌ 25న ఆమె తీవ్ర అనారోగ్యంతో నడవలేని స్థితిలో సొంతూరు కురబలకోటకు చేరుకుంది. ఆరోగ్యం విషమించి సోమవారం మరణించింది. మల్లికకు న్యాయం జరగాలంటూ కుటుంబ సభ్యులు అంగళ్లులో ఏజంటు ఇంటి వద్ద మృతదేహంతో ధర్నా చేశారు. 

బతుకుతెరువు కోసం కువైట్‌ వెళ్లిందామె. అక్కడ ఓ సేఠ్‌ ఇంటిలో పనులు చేస్తూ అష్టకష్టాలు పడింది. చివరికి అనారోగ్యం బారినపడి స్వగ్రామానికి చేరుకుంది. ఆపై ఏజెంట్ల చేతిలో మోసపోయానంటూ ఆ అభాగ్యురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసు విచారణలో ఉండగానే కురబలకోట మండలానికి చెందిన మల్లిక సోమవారం మృతిచెందింది. మృతురాలి కుటుంబీకుల కథనం మేరకు.. కురబలకోట మండలం అరవిందపురానికి చెందిన మల్లిక బతుకుతెరువు నిమిత్తం ఆరేళ్ల కిందట కువైట్‌కు వెళ్లారు. ఏజెంట్ల సూచన మేరకు అక్కడ ఓ సేఠ్‌ ఇంట్లో చేరి ఇంటిపనులు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఆమె స్వగ్రామానికి రాకపోవడంతో మూడేళ్లకిందట మల్లిక కుటుంబీకులు సంబంధిత ఏజెంట్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
అయితే వారి గోడు పోలీసులు పట్టించుకోకుండా అదిగోఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. ఇటీవల మల్లిక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గత ఏడాది డిసెంబరు 25న బెంగళూరు చేరుకుంది. అక్కడికి చేరుకున్న కుటుంబీకులు బక్కచిక్కిన శరీరంతో, నడవలేని ఆమె దీనస్థితిని చూసి బోరుమన్నారు. వెంటనే మదనపల్లె జిల్లా వైద్యశాల, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. అనంతరం కురబలకోటకు చెందిన గల్ఫ్‌ ఏజెంట్‌ జాకీర్‌, అంగళ్లుకు చెందిన నజీర్‌ మోసం చేశారంటూ మల్లిక తన కుటుంబీకులతో కలసి ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో ఉండగానే, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం ఆమె మృతిచెందింది.
 
దీంతో మృతురాలి కుటుంబీకులకు న్యాయం చేయాలంటూ దళిత సంఘ నాయకులు సుదర్శనం, మోహన్‌ మల్లిక మృతదేహం తీసుకుని అంగళ్లులోని ఏజెంట్‌ నజీర్‌ ఇంటి వద్ద ఆందోళన నిర్వహించారు. రూరల్‌ సీఐ అశోక్‌కుమార్‌ ఘటనాస్థలానికి చేరుకుని ఇరువర్గాలతో చర్చించినా ఫలితం లేకపోయింది. ఆందోళనకారులు సాయంత్రం దాకా నజీర్‌ ఇంటి వద్దే బైఠాయించి మృతురాలి కుటుంబీకులకు రూ.20 లక్షల సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. ఎట్టకేలకు సాయంత్రం మరోమారు జరిపిన చర్చలు ఫలించడంతో, మల్లిక మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. మంగళవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు పేర్కొన్నారు.