realty-market-is-good-for-NRIs

భలే మంచి బేరం.. ఇదే మంచి తరుణం!

రూపాయి పతనం, రెరాతో ఎన్‌ఆర్‌ఐలకు ఆకర్షణీయంగా మారిన స్థిరాస్తి కొనుగోళ్లు

ముంబై: ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) స్వదేశంలో స్థిరాస్తులు సమకూర్చుకునేందుకు రియల్టీ మార్కెట్‌ మరింత ఆకర్షణీయంగా మారింది. ఈమధ్యకాలంలో రూపా యి విలువ భారీగా క్షీణించడంతోపాటు రెరా అమలుతో రియల్టీ లావాదేవీల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరగడంతో ఎన్‌ఆర్‌ఐల పాలిట స్థిరాస్తి కొనుగోళ్లు చౌక బేరంగా మారాయని విశ్లేషకులంటున్నారు. డాలర్‌తో రూపాయి మారకం రేటు 73కు చేరువవుతోంది. ‘‘భారత రియల్టీలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశాల్లోని భారతీయులు, సంస్థాగత పెట్టుబడిదారుల పాలిట రూపాయి క్షీణత చాలా మంచి అవకాశంగా మారింది. గడిచిన కొద్ది నెలలుగా దేశీయ స్థిరాస్తి మార్కెట్‌పై ఎన్‌ఆర్‌ఐల ఆసక్తి పెరిగింది. మున్ముందు మరింత ఆకర్షణీయంగా మారనుంది’’ అని సిబిఆర్‌ఇ ఇండియా, ఆగ్నేయాసియా, మిడిల్‌ ఈస్ట్‌, ఆఫ్రికా మార్కెట్ల చైర్మన్‌ అన్షుమన్‌ మ్యాగజైన్‌ అన్నారు.
 
7-8 శాతం వాటా ఎన్‌ఆర్‌ఐలదే..
దేశీయ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లో ఏటా రూ.3 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతాయని.. అందులో ఎన్‌ఆర్‌ఐల కొనుగోళ్ల వాటా 7-8 శాతంగా ఉంటుందని అంచనా. విలువపరంగా చూస్తే రూ.21,000-30,000 కోట్ల స్థాయి లో ఉంటుంది.
 
ఈ ఏడాదిలో రూపాయి విలువ 10 శాతానికి పైగా పతనమైంది. అంటే, దేశీయ కొనుగోలుదారులతో పోలిస్తే ఎన్‌ఆర్‌ఐలు పది శాతం డిస్కౌంట్‌తో మార్కెట్లోకి అడుగు పెడుతున్నారని నిసస్‌ ఫైనాన్స్‌ ఎండి, సిఇఒ అమిత్‌ గోయెంకా అన్నారు. గడిచిన 2-3 నెలల్లో ఎన్‌ఆర్‌ఐల ఎంక్వైరీలు, కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి.
 
ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే ఈ ఏడాది మొత్తం రియల్టీ లావాదేవీల్లో ప్రవాసుల వాటా 10-12 శాతానికి పెరగవచ్చని మార్కెట్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్‌ఆర్‌ఐల కొనుగోళ్ల వాటా పెరిగితే గృహ, వాణిజ్య సముదాయ ప్రాజెక్టుల్లో ఇన్వెంటరీ గణనీయంగా తగ్గుతుందని గోయెంకా ఆశాభావం వ్యక్తం చేశారు.