Rafale-fighter-jet-delivered-to-India

భారత్‌ అమ్ములపొదిలోకి తొలి రఫెల్

 

  • ఐఏఎఫ్‌కు యుద్ధ విమానాన్ని అప్పగించిన దసో
  • నిమ్మకాయలు తొక్కించి.. ‘ఓం’ రాసిన రాజ్‌నాథ్‌
మెరిగ్‌నాక్‌(ఫ్రాన్స్‌)/ఘజియాబాద్‌: అనేక వివాదాల అనంతరం తొలి రఫేల్‌ యుద్ధ విమానాన్ని భారత వాయుసేన(ఐఏఎఫ్‌) లాంఛనంగా అందుకుంది. మంగళవారం ఇక్కడ దసో ఏవియేషన్‌ కేంద్రంలో జరిగిన అప్పగింత కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లారెన్స్‌ పార్లీ పాల్గొన్నారు. చెడుపై మంచి విజయం సాధించిన విజయదశమి రోజు, ఐఏఎఫ్‌ 87వ వార్షికోత్సవం రోజు రఫేల్‌ భారత అమ్ములపొదిలో చేరడం విశేషం. ఫ్రాన్స్‌ నుంచి 36 విమానాల కొనుగోలుకు భారత్‌ ఒప్పందం కుదుర్చుకోగా.. తొలి విమానాన్ని ఐఏఎ్‌ఫకు అప్పగించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ ఆయుధ పూజలు చేశారు. నిమ్మకాయలు తొక్కించి, కొబ్బరికాయ కొట్టారు. విమానాలు, రక్షణ పరికరాల కొనుగోలు ఆత్మరక్షణ కోసమేనని.. ఏ దేశాన్నీ భయపెట్టడానికి కాదని రాజ్‌నాథ్‌ చెప్పారు. పన్నులు, కస్టమ్స్‌ నిబంధనలతో తమను భయపెట్టొద్దని రఫేల్‌ ఇంజన్ల తయారీ సంస్థ శాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజన్స్‌ సీఈవో ఆలివర్‌ ఆండ్రూస్‌ కోరారు. భారత్‌లో ఇంజన్ల నిర్వహణ, శిక్షణ కోసం రూ.1065 కోట్ల మేర పెట్టుబడులు పెడతామని చెప్పారు.
 
అనంతరం రాజ్‌నాథ్‌ కొద్దిసేపు విమానంలో విహరించారు. అంతకు ముందు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌తో ఆయన చర్చలు జరిపారు. కాగా, రఫేల్‌ విమానానికి ఆయుధ పూజ చేయడాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎద్దేవా చేశారు. అదో తమాషా అని వ్యాఖ్యానించారు. బీజేపీ ఏం చేసినా వ్యతిరేకించడమేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. కాగా ఐఏఎఫ్‌ వార్షికోత్సవం సందర్భంగా బాలాకోట్‌ దాడుల్లో పాల్గొన్న జవాన్లకు ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ ఆర్కేఎస్‌ బహదురియా ప్రశంసాపత్రాలు అందజేశారు.