PM-Modi-one-of-Worlds-Best-Leader-says-American-Billionaire-Ray-Dalio

ప్రపంచ అత్యుత్తమ నేతల్లో ప్రధాని మోదీ ఒకరు: అమెరికన్‌ కోటీశ్వరుడు

న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యుత్తమ నేతల్లో మోదీ ఒకరని అమెరికన్‌ కోటీశ్వరుడు రే డాలియో అన్నారు. రియాద్‌లో అక్టోబరు 29న జరిగిన వార్షిక పెట్టుబడిదారుల సమావేశంలో మోదీ కీలక ఉపన్యాసం చేశారు. అనంతరం ఆయన రే డాలియోతో 25 నిమిషాల సేపు మాట్లాడారు. తమ మధ్య జరిగిన ఆ సంభాషణ తాలూకూ వీడియోను డాలియో తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘నా ఉద్దేశంలో, భారత ప్రధాని మోదీ ప్రపంచంలోనే అత్యుత్తమ నాయకుల్లో ఒకరు. లేదా.. అత్యుత్తమ నేత. ఆయన ఎలా ఆలోచిస్తారు? ఏం ఆలోచిస్తారు అనే విషయాలను తెలుసుకునే అవకాశం నాకు లభించింది. మీకూ తెలుసుకోవాలనిపిస్తే ఈ వీడియో చూడండి’ అని ఆయన ట్వీట్‌ చేశారు. చరిత్రలో నిలిచిపోయే ఎన్నో పనులను మోదీ భారత్‌లో చేస్తున్నారంటూ డాలియో ప్రశంసించారు. కాగా.. డాలియో ట్వీట్లకు మోదీ ట్విటర్‌ ద్వారానే స్పందించారు.