Plastic-Bottles-Are-Paying-School-Fees

అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలే.. పిల్లల స్కూల్ ఫీజులు..!

నైజీరియా: పాఠశాలలు ప్రారంభంకాగానే తల్లీదండ్రులకు మొదట గుర్తొచ్చేది పిల్లల స్కూల్ ఫీజులు. వాటిని చెల్లించడానికి పేరెంట్స్ పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. అపసోపాలు పడి పిల్లలకు చదువులు చెప్పిస్తుంటారు తల్లీదండ్రులు. అయితే నైజీరియాలోని ఓ పాఠశాల యాజమాన్యం పిల్లల తల్లీదండ్రులకు స్కూల్ ఫీజులకు బదులు ప్లాస్టిక్ వ్యర్థాలు తెచ్చివ్వండి చాలు అని చెబుతోంది. లాగోస్‌లోని అజెగున్లేలో గల మొరిట్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం ఇలా స్కూల్ ఫీజులకు బదులుగా ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకుంటూ వార్తల్లో నిలిచింది. దీనికి కారణం ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు పాఠశాల యాజమాన్యం సరికొత్తగా ఆలోచించడమే. అంతేగాక పిల్లల ఫీజులు కట్టడానికి తల్లీదండ్రులు పడే బాధలు కూడా వారిని కదిలించాయి. దాంతో ఆఫ్రికన్ క్లీన్ ఆప్ ఇనిషియేటివ్, వీసైక్లీయర్స్ అనే రెండు సంస్థలతో స్కూల్ యాజమాన్యం చేతులు కలిపింది. 

ఈ సంస్థలు రీసైకిల్ పే అనే ప్రాజెక్ట్‌ నెలకొల్పాయి. దీని ద్వారా పిల్లల తల్లీదండ్రుల నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొని దాని బరువుకు తగ్గట్టుగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అలా వచ్చిన నగదు విలువను పాఠశాలకు చెల్లించే ఫీజు మొత్తం నుండి తీసివేయబడుతుంది. నెలకు రెండుసార్లు ఇలా తల్లీదండ్రుల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకుంటోంది స్కూల్ యాజమాన్యం. ఈ ప్రాజెక్ట్‌పై పిల్లల తల్లీదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీనెల పిల్లల స్కూల్ ఫీజు కట్టలేక అవస్థలు పడేవాళ్లమని, ఈ రీసైకిల్ ప్రాజెక్ట్ వచ్చిన తరువాత ఫీజులు కట్టడం సులువుగా మారిపోయిందని చెబుతున్నారు. అలాగే పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా సులభంగా తొలిగించబడుతున్నాయి. మొరిట్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ వచ్చిన తరువాత నుంచి ఫీజులు తొందరగా వసూలు అవుతున్నాయని అన్నారు. ఇక రీసైకిల్ పే ప్రాజెక్ట్ పర్యావరణ పరిశుభ్రతతో పాటు పేద విద్యార్థులకు సులభంగా విద్యను అందిస్తుండడం విశేషం.