Pilot-Mistake-Triggers-Chaos-at-Amsterdam-Airport

పైలట్‌ చిన్న పొరపాటుతో.. విమానాశ్రయంలో తీవ్ర ఉద్రిక్తత..

ఆమ్‌స్టర్‌డామ్‌: పైలట్ చేసిన చిన్న పొరపాటు డచ్ పోలీసులను ఉరుకులు.. పరుగులు పెట్టించడంతో పాటు విమానాశ్రయంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విమానాశ్రయంలో ఆగిన విమానంలో హైజాక్‌కు సంబంధించిన అలారంను పొరపాటున పైలట్ సెట్‌ చేయడం, అది కాస్తా యాక్టివేట్ కావడంతో ఎయిర్‌పోర్టులో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో డచ్‌ పోలీసులు రంగంలోకి దిగి అది ఫేక్‌ అలారం అని నిర్ధారించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. డచ్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లోని షిపోల్ ఎయిర్‌పోర్టులో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. 

విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఆమ్‌స్టర్‌డామ్‌ నుంచి మాడ్రిడ్‌కు బయల్దేరిన విమానంలో పైలట్‌ పొరపాటుగా హైజాక్‌కు సంబంధించిన అలారం యాక్టివేట్‌ చేశాడు. దీంతో ఎయిర్‌పోర్ట్‌ అధికారులకు విమానం హైజాక్‌ అయినట్లు సమాచారం అందింది. వెంటనే భద్రతా సిబ్బందిని రంగంలోకి దింపిన అధికారులు ఫ్లైట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డచ్ పోలీసులు భారీ భద్రతా నడుమ ఆపరేషన్ చేపట్టి అది ఫేక్ అలారం అని తేల్చారు. అంతేగాక పైలట్ పొరపాటుగా దానిని సెట్ చేసినట్లు నిర్ధారించారు. దీంతో విమానాశ్రయ అధికారులతో పాటు అందులోని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన సమయంలో విమానంలో 27 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక విమానంలో హైజాక్‌కు సంబంధించిన అలారం ఎలా యాక్టివేట్‌ అయిందనే విషయాన్ని తమ దర్యాప్తులో తేలుస్తామని పోలీసులు వెల్లడించారు. కాగా, విమానంలో హైజాక్‌కు సంబంధించిన అలారం ఒక్క స్వీచ్‌తో ఆన్‌ చేయలేమని ఏరోనాటిక్స్ నిపుణులు చెబుతున్నారు. దానికి నాలుగు అంకెలతో కూడిన ఓ పాస్‌వర్డ్‌ ఉంటుందన్నారు.