Parents-killed-their-own-daughter-for-wearing-T-Shirt

టీషర్ట్ వేసుకుందని.. తోబుట్టువుల ముందే కన్నకూతురిని..

వారింగ్టన్: ‘పరువు, ఆచారాల కోసం ప్రాణాలు ఇస్తాం లేదా తీస్తాం..’ టెక్నాలజీ ఇంతగా పెరిగినప్పటికీ ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలో ఇప్పటికీ వినపడే మాట ఇది. తమ పరువు కోసం ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించడం నేరం. బ్రిటన్‌లో ఇలాంటి అరాచకమే జరిగింది. అభంశుభం తెలియని ఓ యువతి స్వేచ్ఛను పరువు అనే పంజరంలో బంధించి చివరకు ఆమె ప్రాణాలను బలిగొన్నారు. 2003లో జరిగిన ఈ ఘటన ఓ డాక్యుమెంటరీగా రూపొందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. షఫిలియా(2003 నాటికి 17 సంవత్సరాలు) అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి యూకేలోని వారింగ్టన్‌లో నివసించేవారు. యూకే లాంటి దేశాలలో అమ్మాయిలు టీషర్ట్ వేసుకుని తిరగడం సహజం. షఫిలియా కూడా తనకు నచ్చినట్టు జీవించాలని కోరుకుంది. అయితే ఆమె కోరికలకు తల్లిదండ్రులు అడ్డుచెప్పారు. పాకిస్తాన్‌లోని సంప్రదాయాల ప్రకారం నడుకుకోవాలని, ఎలా పడితే అలా తిరగకూడదని, వెంటనే పెళ్లి చేసుకోవాల్సిందిగా సూచించారు.

లాయర్ అవుదామనుకుంటున్న షఫిలియాకు ఇల్లు జైలులా అనిపించింది. ఎక్కడికైనా వెళ్లిపోవాలనిపించింది. ఎవరెన్ని చెప్పినా తనకు నచ్చిన జీవితాన్నే గడపాలని నిశ్చయించుకుంది. అలా ఓ రోజు టీషర్ట్ వేసుకుని ఇంట్లో కనిపించగా.. షఫిలియా తల్లి గొడవ పెట్టుకుంది. అదే సమయంలో తండ్రి కూడా ఇంటికి రావడంతో గొడవ మరింత పెరిగింది. ఈ రోజుతో ఏదో ఒకటి తేలిపోవాలని కన్నతల్లి షఫిలియాను చంపడానికి నిశ్చయించుకుంది. తల్లిదండ్రులిద్దరూ ఆమె నోట్లో ప్లాస్టిక్ బ్యాగును పెట్టి.. ముక్కు మూసేసి ఊపిరాడకుండా చంపేశారు. షఫిలియాకు మరో ముగ్గురు చెల్లెల్లు, ఒక తమ్ముడు ఉన్నారు. ఎవరైనా తాము చెప్పినట్టు నడుచుకోకపోయినా, షఫిలియాను చంపినట్టు ఎవరికైనా చెప్పినా చంపేస్తామంటూ ఆ నలుగురు పిల్లలను తల్లిదండ్రులు హెచ్చరించారు. దీంతో భయపడిపోయిన పిల్లలందరూ అప్పటి నుంచి ఏం తెలియదన్నట్టు ఉన్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత షఫిలియా చెల్లెలు ఆలేషా ధైర్యంగా ముందుకొచ్చి ఈ విషయాన్ని బయటపెట్టింది. ఆమె పోలీసులకు చెప్పే వరకు తల్లిదండ్రులే ఆమెను హతమార్చినట్టు ప్రపంచానికి తెలియదు. షఫిలియా మరణించే ముందు ఎంతో నరకయాతన అనుభవించిందని ఆలేషా ఆవేదన వ్యక్తం చేసింది. తన శవాన్ని కనిపించకుండా దూరంగా ఉన్న నదిలో పడేసి.. కనిపించడం లేదంటూ తల్లిదండ్రులే నాటకం ఆడారని, నాలుగు నెలల తరువాత శవం దొరికితే అంత్యక్రియలు నిర్వహించినట్టు ఆలేషా తెలిపింది. షఫిలియా తల్లిదండ్రులను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. కోర్టు వారికి 25 ఏళ్ల జైలు శిక్షను విధించింది.