Parent-are-told-their-child-needs-exorcism

పసివాడి ఫొటో చూసి.. బిత్తరపోతున్న నెటిజన్లు.. దెయ్యం పట్టిందంటూ..

లండన్: లేక లేక పుట్టిన కుమారుడిని జాగ్రత్తగా చూసుకోవాలని భావించిందా జంట. అందుకే పసివాడిని ప్రతిక్షణం గమనించడం కోసం బేబీ మానిటరింగ్ సిస్టం కొనుగోలు చేసింది. ఆ తర్వాత అలా చేయడం చాలా పెద్ద తప్పయిపోయిందని లెంపలేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి తన కుమారుడి కోసం ఓ బేబీ మానిటరింగ్ సిస్టం కొన్నాడు. దాన్ని కుమారుడి ఉయ్యాలకు బిగించాడు. ఆ రాత్రి పిల్లాడేం చేస్తున్నాడా? అని చూసిన అతనికి ఒక్క క్షణం గుండె ఆగినంతపనైంది. ఎందుకంటే ఆ కెమెరాలో తన పిల్లాడు పెద్ద దెయ్యంలా కనిపించాడు. దాన్ని చూసిన అతను ఆ ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నాడు.

కొత్తగా బేబీ మానిటరింగ్ సిస్టం కొన్నానని, అది కొనడం చాలా పెద్ద తప్పయిపోయిందని వ్యాఖ్యానించాడు. ఇంతకీ ఆ పిల్లాడు ఎందుకంత భయంకరంగా ఉన్నాడంటే.. అసలే చీకటి కావడంతో కెమెరా నైట్  మోడ్‌లో రికార్డు చేసింది. దాంతో నీడలు మరీ ఎక్కువగా కనిపించాయి. అదే సమయంలో కెమెరా ఫొటో తీసిన సమయంలో పడిన ఫ్లాష్ పిల్లాడి కళ్లలో ప్రతిబింబించింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఆ పిల్లాడికి దెయ్యం పట్టిందంటూ కామెంట్లు చేస్తున్నారు. వాళ్లని ఎగతాళి చేద్దామనుకున్న ఆ పసివాడి తండ్రి.. తన పిల్లాడు మామూలుగా చూసినా అలానే ఉంటాడంటూ ఫొటోషాప్‌లో ఎడిట్ చేసిన మరో ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశాడు. అది చూసిన తర్వాత నెటిజన్ల కామెంట్లు మరీ పెరిగిపోవడంతో ఏం చేయాలో తోచక తల పట్టుకున్నాడు.