Pak-Foreign-Minister-Qureshi-Controversial-Comments

మీరు 'ఫూల్స్‌' .. మనకు మద్దతు లభించడం అంత తేలిక కాదు

పాకిస్థాన్‌కు భద్రతా మండలి, ముస్లిం ప్రపంచం మద్దతివ్వడం తేలిక కాదు

పాక్‌ విదేశాంగ మంత్రి ఖురేషి వ్యాఖ్యలు
ఇస్లామాబాద్‌, ఆగస్టు 13: కశ్మీరుపై భారత్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా భద్రతా మండలితో పాటు ముస్లిం ప్రపంచం నుంచి మద్దతు సంపాదించడం తేలికేం కాదని పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి మహమూద్‌ ఖురేషి స్పష్టం చేశారు. పిచ్చోళ్లలా ఆలోచించవద్దని పాకిస్థానీలకు హితవు పలికారు. భద్రతా మండలి మద్దతు సంపాదించాలంటే కొత్త పోరాటం చేయాలని సూచించారు. పీవోకేలోని ముజఫరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
 
‘‘మీరు ‘ఫూల్స్‌ ప్యారడైజ్‌’లో ఉండిపోకండి. భద్రతా మండలిలో ఎవరూ చేతుల్లో పుష్పగుచ్ఛాలతో మీ కోసం ఎదురుచూడటం లేదు’’ అని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘ఉమ్మాహ్‌ (ఇస్లామిక్‌ సమాజం) రక్షకులు’ సైతం తమ ఆర్థిక ప్రయోజనాల కోసం కశ్మీరు అంశంపై పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వరని తెలిపారు. ‘‘ప్రపంచంలో ఎవరి ప్రయోజనాలు వారికి ఉన్నాయి. ఇండియా వంద కోట్ల మందికిపైగా ఉన్న మార్కెట్‌. చాలామంది అక్కడ పెట్టుబడులు పెట్టారు’’ అని చెప్పారు.