Pak-Airlines-Plane-Skids-Off-Runway-In-Gilgit-Airport

రన్‌వేపై స్కిడ్ అయిన విమానం.. ప్రయాణికులంతా..

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)కు చెందిన విమానం గిల్గిత్ ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై స్కిడ్ అయింది. పైలట్, కో-పైలట్ చాకచక్యంగా విమానాన్ని అదుపు చేయడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఇస్లామాబాద్ నుంచి గిల్గిత్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఈ ఏటీఆర్-42 విమానంలో మొత్తం 48 మంది ప్యాసెంజర్లు ప్రయాణించారు. రన్‌వే పక్కన ఉన్న గడ్డిలోకి విమానం వెళ్లడంతో మిగతా విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ఘటన కారణంగా కొద్ది సేపు విమానాశ్రయాన్ని కూడా మూసివేయాల్సి వచ్చింది. జరిగిన ఘటనపై ఇంక్వైరీ చేయాలని పీఐఏ చీఫ్ మార్షల్ అర్షద్ మాలిక్ ఆదేశించారు. విమానం స్కిడ్ అవడానికి ఎవరైనా కారణమని తెలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ఘటనపై రిపోర్ట్ వచ్చేంత వరకు పైలట్, కో-పైలట్ విమానాన్ని నడపకూడదని ఆర్డర్‌ జారీ చేశారు. కాగా, ఇదే ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం 2016లో చిత్రల్ నుంచి ఇస్లామాబాద్ వస్తూ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 47 మంది ప్యాసెంజర్లు మృతిచెందారు.