Olga-Tokarczuk-Wins-2018-Nobel-For-Literature-and-Peter-Handke-For-2019

నోబెల్ సాహిత్య పురస్కారాన్ని దక్కించుకున్న ఓల్గా, పీటర్

స్టాక్‌హోమ్: సాహిత్య రంగంలో ప్రతిష్టాత్మకమైన నోబెల్ సాహిత్య పురస్కారాన్ని పోలాండ్‌కు చెందిన రచయిత్రి ఓల్గా టొకార్‌జక్, ఆస్ట్రియాకు చెందిన రచయిత పీటర్ హాండ్కే దక్కించుకున్నారు. 2018 సంవత్సరానికి గాను ఓల్గాకు, 2019 సంవత్సరానికి గాను పీటర్‌కు ఈ అవార్డులను ప్రకటించారు. గురువారం ఈ అవార్డులను స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. స్వీడిష్‌ అకాడమీ ప్రపంచ సాహిత్య రంగంలోని ప్రముఖ రచయితలను జల్లెడపట్టి వారిలో ఒకరికి ప్రతి ఏడాది ఈ పురస్కారాన్ని ప్రకటిస్తుంది.

 కానీ గత సంవత్సరం స్వీడిష్‌ అకాడమీలోని 18 మంది సభ్యులలో ఒకరిగా ఉన్న కాటరినా ఫ్రాస్టెన్సన్ భర్త జీన్‌ క్లాడ్‌ ఆర్నాల్డ్‌ మీద పలు లైంగిక ఆరోపణలు రావడంతో గతేడాది నోబెల్ సాహిత్య పురస్కారాన్ని ఏ ఒక్కరికీ ప్రకటించలేదు. క్లాడ్ ఆర్నాల్డ్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత స్వీడన్‌లో ప్రజా నిరసన వెల్లువగా వచ్చింది. ఈ సందర్భంగా స్వీడిష్‌ అకాడమీ పరిధి నుంచి నోబెల్‌ సాహిత్య పురస్కారాలను తప్పించాలన్న అభిప్రాయం వెల్లడయింది. ఈ సందర్భంగా రంగంలోకి దిగిన నోబెల్‌ ఫౌండేషన్‌ సభ్యులు ఈ ఆరోపణలకి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకుని కొన్ని కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చారు. ప్రస్తుతం ఉన్న సభ్యులే కాకుండా మరో ఐదుగురు స్వతంత్ర సభ్యులకు కూడా అకాడమీలో స్థానం కల్పించారు. ఆ విధంగా నియమాలను మార్చారు. సాధారణంగా నోబెల్‌ కమిటీలో పద్దెనిమిది మంది సభ్యులు ఉంటారు. ఇక నుంచి కొత్త సభ్యులు కూడా కలిసి సాహిత్య విజేతని ఎన్నుకుని ప్రకటించవలసిన విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు.