NRIs-says-memusaitham-for-NATS-Sambaralu-

నాట్స్ సంబరాలకు మేముసైతం కార్యక్రమానికి విశేష స్పందన

వెస్ట్ మౌంట్, అరోరాలో తెలుగువారి నుంచి మద్దతు


మార్చ్ 3: అమెరికాలో జరిగే అతి పెద్ద తెలుగు సంబరాలకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) అమెరికాలోని వివిధ నగరాల్లో సంబరాలకు మేముసైతం అనే కార్యక్రమాన్ని  చేపట్టింది. ఇలినాయిస్‌లోని వెస్ట్ మౌంట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 100 మందికి పైగా తెలుగువారు విచ్చేసి నాట్స్ సంబరాల్లో మేముసైతమంటూ ముందుకొచ్చారు. నాట్స్ సంబరాలను ఘనంగా నిర్వహించడంలో  తమ వంతు పాత్ర పోషిస్తామని వెస్ట్ మౌంట్ ప్రాంతంలో ఉన్న తెలుగు వారు హామీ ఇచ్చారు.  ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో జరిగే తెలుగు సంబరాలు ఈ సారి చికాగో వేదికగా జరగబోతున్నాయని సంబరాల కన్వీనర్ రవి అచంట తెలిపారు.
 
చికాగోలోని శ్యాంబర్గ్ , ఐఎల్ లో జూన్ 30, నుంచి జులై 2 వరకు జరిగే  ఈ తెలుగు సంబరాలను ప్రతిష్టాత్మకంగా  నిర్వహించేందుకు తెలుగువారంతా మద్దతివ్వాలని రవి అచంట కోరారు. సంబరాల్లో ఎలాంటి కార్యక్రమాలను చేయనున్నామనేది  ఆయన వివరించారు. నాట్స్ అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలబడుతుందని.. ఇటు అమెరికాతో పాటు అటు తెలుగునేలలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. కార్యదర్శి మదన్ పాములపాటి, కోశాధికారి శ్రీనివాస్ బొప్పన, మహిళా ఫోరం తరఫున రాజీ మన్నె తదితరులు సంబరాల కు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నది వివరించారు.  సంబరాలకు మేము సైతమంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హరీ జమ్ముల, సంబరాల డైరక్టర్ అరవింద్ కోగంటి, పాండు చెంగలశెట్టి తదితరులకు సంబరాల కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఆ తర్వాత అరోరాలో జరిగిన సంబరాలకు మేముసైతం కార్యక్రమంలో పాల్గొంది. ఇక్కడ ఆర్.కె. బాలినేని, వెంకట్ దాములూరి, గోపాల్ శీలం, శ్రీకాంత్ తదితర బృందం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. అక్కడ నాట్స్ సంబరాలకు మేముసైతమంటూ చాలా మంది ముందుకొచ్చారు. అమెరికాలో తెలుగుజాతికి నాట్స్ చేస్తున్న సేవలను కొనియాడారు. అమెరికా తెలుగు సంబరాలకు తెలుగువారంతా చికాగోకు తరలిరావాలని నాట్స్ సంబరాల కమిటీ అందరిని ఆహ్వానించింది.

 ఫోటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి..