NRIs-call-for-stringent-action-in-veterinary-doctor-case

వైద్యురాలి హత్యాచారం కేసులో.. గళమెత్తిన ప్రవాసీలు.. ఏమంటున్నారంటే..

జెడ్డా: హైదరాబాద్‌లో జరిగిన వైద్యురాలి హత్యాచారం ఘటనపై సౌదీలోని ప్రవాసీలు గళమెత్తారు. పాశవికంగా ప్రవర్తించిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రవాసీలు.. తమలో చాలామంది భార్యాపిల్లలను స్వదేశంలోనే వదిలి వెళ్లామని, వారికేం అవుతుందోనని భయమేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘోరాలకు పాల్పడే నీచులను కఠినంగా శిక్షిస్తేనే మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పారు.

దుబాయిలో ఉంటున్న సరితా రెడ్డి ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘నాకు ఇద్దరు కుమార్తెలున్నారు. వారు ఎప్పుడైనా భారత్‌కు తిరిగెళ్తే వారి పరిస్థితేంటని భయమేస్తుంది. ఈ పరిస్థితికి కారణం భారత్‌లో అత్యాచార నిందితులకు కఠినశిక్షలు వేయకపోవడమే’ అని అన్నారు. అలాగే విపరీతమైన మద్యపానం, ఇంటర్నెట్ వాడకం వల్ల యువత పెడదార్లు పట్టడమేకాక, ఇతరుల జీవితాలను ఇలా నాశనం చేస్తోందని ఆరోపించారు. ఇలా అనేకమంది ప్రవాసీలు వైద్యురాలి కేసులో నిందితులకు కఠినశిక్షలు వేయాలని, ఇటువంటి దుర్ఘటనలు మరిన్ని జరగకుండా చర్యలు తీసుకోవాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.