NRIs-asks-Undavalli-to-react-on-APs-situation

ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు ప్రవాసాంధ్రుల బహిరంగ లేఖ

అమరావతి: కాంగ్రెస్ మాజీ ఎంపీ, సీనియర్ నేత ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు ప్రవాసాంధ్రులు బహిరంగ లేఖ రాశారు. ఏపీ ప్రయోజనాలు, గోదావరి జలాల విషయమై ఈ లేఖలో ప్రవాసాంధ్రులు ప్రస్తావించారు. "ఏపీ ప్రయోజనాల కోసం తపించే వ్యక్తిగా మీరంటే మాకు ఎంతో గౌరవం. విభజన సమయంలోనూ ఆ తరువాతి పరిణామాల్లోనూ మీ భావజాలం సుప్రీంకోర్టు తలుపులు తట్టిన మీ క్రియాశీలత చూసి మీరంటే ఇంకా గౌరవం పెరిగింది. కొద్ది రోజులుగా విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలు.. గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించే కొత్త ప్రతిపాదనలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయనే అనుమానం ఉంది. మీలాంటి మేధావులు స్పందించి వీటిపై మాట్లాడాలి. ఇవన్నీ రాష్ట్రానికి మేలు చేస్తాయా లేక మరోసారి మన వేలితో మన కన్నే పొడుచుకుంటున్నామా అనే విషయంపై బహిరంగంగా చర్చించాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు స్పందించాలని కోరుతున్నాం" అని లేఖలో ఉండవల్లిని ప్రవాసాంధ్రులు కోరారు. అయితే ఈ లేఖపై ఉండవల్లి ఎలా రియాక్ట్ అవుతారో..? ఈ విషయాలపై చర్చిస్తారా..? లేకుంటే మిన్నకుండిపోతారా..? అనేది తెలియాల్సి ఉంది.