బెంగళూరు: లాటరీ పేరుతో ఎన్నారై మహిళను కేటుగాళ్లు ఏకంగా రూ. 1.61 కోట్లు కుచ్చుటోపీ పెట్టారు. బెంగళూరుకు చెందిన 60 ఏళ్ల మహిళను... లాటరీలో సుమారు రూ. 9.30కోట్లు గెలుచుకున్నారని చెప్పి... ప్రైజ్ మనీని ఆమె ఖాతాలో జమ చేసేందుకు ట్యాక్సుల పేరుతో రూ. 1.61 కోట్లు దండుకున్నారు. కానీ ఎంతకు లాటరీ నగదు తన ఖాతాలో జమ కాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు బెంగళూరు పోలీసులను ఆశ్రయించడంతో ఈ భారీ మోసం బయటపడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గత ఏడాది డిసెంబర్ 21న బెంగళూరుకు చెందిన అంబుజాక్షి శ్రీనివాస(60)కు గుర్తు తెలియని ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్‌లో తనను తాను బ్రౌన్‌గా పరిచయం చేసుకున్నాడు అవతలి వ్యక్తి. తాను ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థలో ఏజెంట్ అని చెప్పాడు. ఇటీవలె తాను లండన్ నుంచి వచ్చి న్యూఢిల్లీలో ఉంటున్నట్లు తెలిపాడు. తమ కంపెనీ ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రమోషనల్ రాఫెల్‌లో ఈసారి ఆమె ఫోన్ నెంబర్‌కు లాటరీ తగిలినట్లు చెప్పాడు. దీనిలో భాగంగా ఆమె పది లక్షల పౌండ్స్(రూ.9.30 కోట్లు) గెలుచుకున్నట్లు నమ్మించాడు. ఈ భారీ మొత్తం ఆమె ఖాతాలో జమ చేసేందుకు రూ. 79వేలు ట్యాక్స్ చెల్లించాలని తెలిపాడు. ఆ మాటలు నమ్మిన అంబుజాక్షి అతను చెప్పిన ఖాతాలో రూ. రూ. 79వేలు వేసింది.
నగదు ట్రాన్స్‌ఫర్ కాగానే వేర్వేరు వ్యక్తుల నుంచి ఆమెకు వరుసగా ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. బ్రౌన్ తమకు ఆమె లాటరీ గెలుపొందిన విషయం చెప్పారని... ఆ ప్రైజ్ మనీ పొందాలంటే కొంత మొత్తం ట్యాక్స్ చెల్లించాలని చెప్పి... వివిధ దఫాలలో సుమారు రూ. 1.67 కోట్లు తమ ఖాతాల్లో జమ చేయించుకున్నారు. ఇలా భారీ మొత్తం కేటుగాళ్ల అకౌంట్లలో వేసిన అంబుజాక్షి... రోజులు గడుస్తున్న తనకు రావాల్సిన ప్రైజ్ మనీ రాకపోవడం... పైగా తాను డబ్బులు పంపించిన వ్యక్తుల ఫోన్లు స్వీచాఫ్ కావడంతో ఆమె మోసపోయానని గ్రహించింది. వెంటనే బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మోసగాళ్లను గుర్తించే పనిలో ఉన్నారు. కాగా, అంబుజాక్షి కుటుంబం రెండు దశాబ్దాలుగా జమైకాలో స్థిర పడ్డింది. ఆమె భర్త, కుమారుడు ఇద్దరు అక్కడ డాక్టర్లుగా పని చేస్తున్నారు. ఈ ఘటన వారిని కూడా షాక్‌కు గురి చేసింది.