NRI-Engineers-Family-Cheating-Rs-15-Lakh-in-the-name-of-Marriage

పెళ్లి పేరుతో రూ. 15 లక్షలు మోసం చేసిన ఎన్నారై !

ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌లోని కవినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లి పేరుతో ఓ ఎన్నారై ఇంజినీర్ రూ. 15 లక్షలు మోసం చేసిన ఉదాంతం తాజాగా వెలుగుచూసింది. మొదటి భర్త నుంచి విడాకులు తీసుకొని ఇంట్లోనే ఉంటున్న కూతురికి ఆమె తల్లిదండ్రులు రెండో పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్న సమయంలో కవినగర్‌కు చెందిన ఎన్నారై యువకుడి విషయం తెలిసింది. దాంతో ఇరు కుటుంబాలు మాట్లాడుకొని పెళ్లి నిశ్చయించారు. ఈ క్రమంలో కూతురిని అల్లుడితో పాటు కెనడా పంపించేందుకు ఆమె తల్లిదండ్రులు ముందుగానే రూ. 15 లక్షలు ఎన్నారైకి అందించారు. అయితే, నిశ్చితార్థం తర్వాత ఆ ఎన్నారైకి అప్పటికే పెళ్లైందని తెలిసింది. దాంతో మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. 

ఏఎస్‌పీ మనీష్ మిత్ర్ తెలిపిన వివరాల ప్రకారం... రాజ్‌నగర్‌లో నివాసముండే మహిళకు వివాహమై భర్తతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంది. దాంతో ఆమె తల్లిదండ్రులు వేరే పెళ్లి చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలో వారికి కవినగర్‌‌కు చెందిన కెనడాలో ఉండే ఎన్నారై ఇంజినీర్ విషయం తెలిసింది. దాంతో వారు అతని కుటుంబ సభ్యులను కలిశారు. ఇరు కుంటుంబాలు మాట్లాడుకొని వారిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. డిసెంబర్ 4న నిశ్చితార్థం జరిపించి 8న పెళ్లి నిశ్చయించారు. అయితే, ఎన్నారై యువకుడు నిశ్చితార్థానికి ముందే కాబోయే భార్యను కెనడా తీసుకెళ్లడానికి రూ. 15 లక్షలు ఖర్చు అవుతాయని ఆమె తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి తీసుకున్నాడు. పైగా నిశ్చితార్థంకు అతను రాలేదు. దాంతో యువతి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఆరా తీయగా అతనికి ముందే పెళ్లైందని, కెనడాలో భార్యపిల్లలు ఉంటున్నట్లు తెలిసింది. ఈ విషయమై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎన్నారై కుంటుంబంపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.