NRI-driver-did-this-to-her

కారులో నిద్ర పోయిన ప్యాసింజర్.. ఉబెర్ డ్రైవర్ పనికి ఆమె షాక్..

న్యూయార్క్: ఇంటికెళ్లాలని ఉబెర్ కారు బుక్ చేసుకుందా న్యూయార్క్ మహిళ. తన కోసం వచ్చిన కారులో కూర్చుంది. ఉదయం నుంచీ పని చేసిన శరీరం అలసిపోవడంతో వెనుకసీటులో కునుకు తీయడం మొదలెట్టింది. ఆమె అలా నిద్ర పోవడాన్ని తన ముందున్న అద్దంలో చూశాడా డ్రైవర్. ఆమె దిగాల్సిన ప్రదేశాన్ని ఉబెర్ యాప్‌లో మార్చేశాడు. ఎక్కడా ఆపకుండా కారు తోలుతూనే ఉన్నాడు. కాసేపటికి ఆమెకు మెలకువ వచ్చింది. చూస్తే తాన న్యూయార్క్‌ నగరాన్ని దాటేసి కనెక్టికట్ ప్రాంతాన్ని చేరినట్లు గుర్తించింది. డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగి.. తనను తన గమ్యస్థానంలో దింపాలని, లేదంటే దగ్గరలోని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లాలని కోరింది. ఆమె మాటలను పట్టించుకోని ఆ డ్రైవర్.. రోడ్డు పక్కనే కారు ఆపేసి ఆమెను బలవంతంగా కారు దింపేశాడు. అక్కడికి దగ్గరలోని ఓ దుకాణానికి వెళ్లిన ఆమె అక్కడి వారి సాయంతో దగ్గరలోని ఓ పోలీసు స్టేషన్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. దాంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న వారు.. హర్బీర్ పార్మర్ అనే ఆ పాతికేళ్ల డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. హర్బీర్ అలా ప్రవర్తించడం, తన కస్టమర్ల నమ్మకాన్ని ఉపయోగించుకోవడం కొత్తకాదని తేలింది. అతను ఇలా చాలామందిని మోసం చేసినట్లు గుర్తించిన న్యాయస్థానం పార్మర్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది.