NRI-complaint-leads-to-reveals-sensational-things

మోసపోయిన ఎన్నారై.. ఫిర్యాదుతో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి..!

 

కిలాడీ కల్నల్‌!
ఆర్మీ నుంచి పారిపోయి మోసాలు
లుకౌట్‌ నోటీసు జారీ చేసిన ఐబీ
పేరు, ఊర్లు మార్చి వరుస నేరాలు
కోచింగ్‌ సెంటర్‌ పేరుతో కోట్లు స్వాహా
ఎన్నారై ఫిర్యాదుతో ఏపీ సీఐడీ అరెస్ట్‌

అమరావతి (ఆంధ్రజ్యోతి):బీటెక్‌ చదివాడు.. దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆర్మీలో చేరాడు. కానీ.. ఇమడలేక అక్కడినుంచి పారిపోయాడు. పేర్లు, ఊర్లు మార్చి మోసాలకు పాల్పడుతూ.. నమ్మిన వారిని నట్టేట ముంచాడు. అందినకాడికి దోచుకుని.. చివరకు ఓ ఎన్నారై ఫిర్యాదుతో ఏపీ సీఐడీకి చిక్కాడు. ఇప్పుడు విశాఖ సెంట్రల్‌ జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. సీఐడీ తెలిపిన వివరాల ప్రకారం.. బైరి అజిత్‌ కుమార్‌ రెడ్డి బీటెక్‌ అనంతరం 1997లో ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడు. 2016 ఫిబ్రవరి వరకూ ఆర్మీలోనే కొనసాగిన ఆయన చివరిగా లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో పనిచేశాడు. ఆ తర్వాత ఆర్మీ నుంచి పారిపోయి విశాఖలో మకాం పెట్టాడు. సంజయ్‌ కుమార్‌ గురాడేగా పేరు మార్చుకుని విశాఖలోని ఒక ఇనిస్టిట్యూట్‌లో ఫిజిక్స్‌ లెక్చరర్‌గా చేరాడు. తూర్పు గోదావరికి చెందిన ఒక ఎన్నారై ఫిజిక్స్‌ సబ్జెక్టుపై ఉన్న పట్టుని గమనించి అతని ఆధ్వర్యంలో కోచింగ్‌ సెంటర్‌ను ప్రారంభించేందుకు ముందుకొచ్చారు.
 
దానికోసం రూ.1.65 కోట్లు పెట్టుబడి పెట్టారు. విద్యార్థుల నుంచి భారీ ఎత్తున ఫీజులు వసూలు చేశారు. ఆ మొత్తం సొమ్ముతో అజిత్‌ కుమార్‌ ఉడాయించాడు. దీంతో ఆ ఎన్నారై విశాఖలోని సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సీఐడీ విచారణలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. విశాఖలో ఇల్లు ఖాళీ చేసే సమయంలో చుట్టుపక్కల వారికి తాను మధురవాడకు షిఫ్ట్‌ అవుతున్నానని చెప్పిన అజిత్‌ కుమార్‌ విజయవాడ వచ్చాడు. ఆ తర్వాత అక్కడి నుంచి మరోచోటకి మకాం మార్చాడు. అతని కోసం తీవ్రంగా గాలించిన సీఐడీ అధికారులు చివరకు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో అతన్ని పట్టుకున్నారు. అతన్ని తెలంగాణలోని హన్మకొండ జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు. 
 
ఆర్మీ నుంచి పారిపోయిన నేపథ్యంలో ఆర్మీ అధికారులు అతన్ని వెతికి పట్టుకునే పనిని పోలీస్‌ ఏజెన్సీలకు అప్పగించారు. ఐబీ కూడా అతనిపై లుకౌట్‌ నోటీసు జారీ చేసింది. అజిత్‌ కుమార్‌ ప్లాట్లు ఇప్పిస్తానని చెప్పి సికింద్రాబాద్‌లో అనేక మంది రిటైర్డ్‌ ఆర్మీ అధికారుల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్టు సీఐడీ విచారణలో వెల్లడైంది. అజిత్‌ను నమ్మి తాను రూ.46.4 లక్షలు మోసపోయినట్టు కల్నల్‌ అశోక్‌బాబు 2016లో హైదరాబాద్‌లోని సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అజిత్‌ కుమార్‌ వల్ల మోసపోయిన వారు ఇంకెవరైనా ఉంటే 9440700856, 8331043260 నంబర్లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని సీఐడీ అధికారులు తెలిపారు.