NRI-booked-for-sending-triple-talaq-on-WhatsApp

వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్.. అది విన్న భార్య షాక్..

కసర్గోడ్: కేరళకు చెందిన ఓ ఎన్నారైపై ట్రిపుల్ తలాక్ కేసు నమోదైంది. తనకు వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ ద్వారా మూడు సార్లు తలాక్ చెప్పిన బీఎమ్ అష్రాఫ్(34) వెంటనే మరో వివాహం చేసుకున్నాడంటూ ఓ మహిళ కసర్గోడ్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె చేసిన ఫిర్యాదు ప్రకారం, యూఎఈలో ఉద్యోగం చేస్తున్న బీఎమ్ అష్రాఫ్‌కు 2007లో ఆమెతో వివాహమైంది. ఆ సమయంలో కట్నం కింద రూ.2.5 లక్షల డబ్బు, రూ.5.5లక్షల విలువైన ఆభరణాలు తీసుకున్నాడు. అయినా అష్రాఫ్ ఆశ తీరలేదు. ఇంకా సొమ్ము తీసుకురావాలంటూ ఆమెను తీవ్రంగా హింసించసాగాడు. ఇంటికొచ్చిన ప్రతిసారీ నరకం చూపిస్తున్న భర్తపై మార్చి నెలలో గృహహింస కేసు పెట్టిందామె. కొన్ని రోజులు మారినట్లు నటించిన అష్రాఫ్.. మళ్లీ తన రాక్షసత్వాన్ని చూపించడం మొదలెట్టాడు. ఇంకా డబ్బు తీసుకురాకపోతే విడాకులిచ్చేస్తానని బెదిరించాడు. తన కుటుంబ పరిస్థితి బాగోలేదని, అందువల్ల డబ్బు ఇవ్వలేరని ఆమె నచ్చజెప్పడానికి చూసినా వినలేదు. చివరకు ఓరోజు ఆమెకు వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఏంటా అని చూసిన ఆమె మూడు సార్లు తలాక్ అని వినిపించడంతో షాకైంది. ఆ మరుసటిరోజే మరో మహిళను వివాహమాడిన అష్రాఫ్.. ఆమెతో కలిసి యూఏఈ చెక్కేశాడు. దీంతో భోరుమన్న ఆమె.. పోలీసులకు సమాచారమిచ్చింది. దీంతో అష్రాఫ్‌పై ట్రిపుల్ తలాక్ కేసు బుక్ చేసుకున్న పోలీసులు.. అతన్ని భారత్‌కు తిరిగి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

Related Articles