Nobel-Prize-in-Medicine-Awarded-to-3-Scientists

ప్రాణవాయువుపై పరిశోధనకు వైద్య నోబెల్‌

 

  • ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రకటించిన కమిటీ
  • వారిలో ఇద్దరు అమెరికన్లు.. ఒకరు బ్రిటిషర్‌
  • శరీరంలోని కణాలు ఆక్సిజన్‌ లభ్యతను గుర్తించే విధానంపై వారి పరిశోధనకు గొప్ప గౌరవం
స్టాక్‌హోం, అక్టోబరు 7:ప్రాణవాయువు (ఆక్సిజన్‌) లభ్యతను కణాలు ఎలా గుర్తిస్తాయి? ఆక్సిజన్‌ తక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తాయి? అనే అంశంపై పరిశోధన చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలను 2019 సంవత్సరానికిగాను ప్రతిష్ఠాత్మక వైద్య నోబెల్‌ వరించింది. ఆ ముగ్గురు శాస్త్రవేత్తలూ.. యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ అండ్‌ ఫ్రాన్సిస్‌ క్రీక్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సర్‌ పీటర్‌ రాట్‌ క్లిఫ్‌, హార్వర్డ్‌ యూనివర్సిటీకి చెందిన విలియం కేలిన్‌, జాన్‌హాప్కిన్స్‌ యూనివర్సిటీకి చెందిన గ్రెగ్‌ సెమెంజా. వీరిలో పీటర్‌ రాట్‌క్లిఫ్‌ బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్త. మిగతా ఇద్దరూ అమెరికన్లు. ఆక్సిజన్‌ ప్రాముఖ్యం గురించి కొన్ని శతాబ్దాలుగా మనకు తెలుసు. కానీ, ఆక్సిజన్‌ స్థాయులకు తగినట్టుగా కణాలు ఎలా మారుతాయో తెలియదు. దీన్ని గుర్తించినందుకే వారికి నోబెల్‌ ప్రకటించారు. రోగనిరోధక వ్యవస్థ పనిచేయడంలో, అమ్మ కడుపులో ఉన్న తొలిదశల్లో ఆక్సిజన్‌ అత్యంత అవసరం.
 
ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, రక్తనాళాల తయారీని ప్రేరేపించేది ఆక్సిజనే. వీరు చేసిన పరిశోధనల ఆధారంగా ఈ రెండు పనులనూ(ఎర్రరక్త కణాల, రక్తనాళాల ఉత్పత్తి) చేయగలిగే మందు లు కనిపెడితే రక్తహీనతకు చెక్‌ పెట్టొచ్చు. అలాగే కేన్సర్‌ కణితులు ఈ ప్రక్రియనే(ఎర్రరక్త కణాలు, రక్తనాళాల ఉత్పత్తి) తమ అదుపులోకి తీసుకు ని తామరతంపరగా అభివృద్ధి చెందుతాయి. అలా చేయకుండా అడ్డుకునే మందులను కనిపెడితే కేన్సర్‌కూ అడ్డుకట్ట వేయొచ్చు. ఇంత కీలకమైన అంశం కాబట్టే వారికి వైద్య రంగంలో నోబెల్‌ పురస్కారం వచ్చింది.