ndian-man-smuggles-foreign-nationals-into-US

దొంగచాటుగా అగ్రరాజ్యానికి.. అడ్డంగా బుక్కయిన భారతీయుడు

న్యూజెర్సీ: భారతీయులను అక్రమంగా అమెరికాకు తరలిస్తున్న ఓ భారతీయుడిని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత్‌కు చెందిన భావిన్ పటేల్ అనే 38ఏళ్ల వ్యక్తి ఈ మోసాలకు పాల్పడుతున్నాడని వారు తెలిపారు. ఇలాంటిదేదో జరుగుతోందనే అనుమానంతో ఓ పోలీసు అధికారినే అక్రమ రవాణా చేసే ఏజెంటుగా భావిన్‌కు పరిచయం చేశామని, అతని ద్వారానే భావిన్ గుట్టు రట్టయిందని చెప్పారు. థాయ్‌లాండ్‌లో భావిన్‌ను  కలిసిన తమ ఆఫీసర్.. తనను తాను అక్రమ రవాణా దారుగా పరిచయం చేసుకున్నాడని, అతని మాటలను భావిన్ నమ్మాడని వారు తెలిపారు. తనకు తెలిసిన కొందరు భారతీయులు అమెరికాకు వెళ్లానుకుంటున్నారని, వారిని దొంగచాటుగా అమెరికాకు చేరిస్తే అడిగినంత సొమ్ము ఇస్తానని ఆశ చూపాడు. అతని మాటలను నమ్మినట్లు ఆ అధికారి నటించాడు. ఆ తర్వాత దాదాపు ఆరుగురిని అమెరికాకు తరలించాలంటూ భావిన్ ఆ అధికారిని కలిశాడు. భావిన్‌కు వ్యతిరేకంగా పక్కా సాక్ష్యాలు లభించడంతో అమెరికా పోలీసులు ముందడుగు వేశారు. వెంటనే అతన్ని అరెస్టు చేసి ధర్మాసనం ముందు నిలబెట్టారు. అక్రమ సంపాదన కోసమే తాను ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు భావిన్ అంగీకరించాడు. దాంతో ధర్మాసనం అతనికి 10 ఏళ్ల జైలుశిక్షతోపాటు 2.5లక్షల డాలర్ల (రూ.1.7కోట్లపైగా) జరిమానా కూడా విధించింది.