NATS-invites-AP-CM-for-its-sambaraalu

ఏపీ సీఎంతో నాట్స్ ప్రతినిధుల భేటీ

నాట్స్ సంబరాలకు ఏపీ సీఎంకు ఆహ్వానం

ఏపీ సచివాలయంలో సీఎంను కలిసిన నాట్స్ టీం సభ్యులు 
సీఎం చేతుల మీదుగా ప్రియాంక తండ్రికి చెక్కు పంపిణి

అమరావతి, ఏప్రిల్ 21: ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే అమెరికా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆహ్వనించింది. అమరావతిలోని ఏపీ సచివాలయంలో నాట్స్ బృందం ముఖ్యమంత్రిని కలిసి తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించింది. అమెరికాలో ప్రమాదవశాత్తు చనిపోయిన ప్రియాంక గోగినేని కుటుంబానికి నాట్స్ తరపున రూ.10 లక్షల 80 వేల చెక్కును సీఎం చేతుల మీదుగా ప్రియాంక తండ్రికి అందజేశారు. చికాగో వేదికగా ఈ సారి తెలుగు సంబరాలు జరగనున్నాయని, జూన్ 30, జులై 1, 2 తేదీల్లో జరిగే ఈ తెలుగు సంబరాలకు ముఖ్య అతిథిగా రావాలని సీఎం చంద్రబాబును నాట్స్ ఆహ్వానించింది. సేవే గమ్యం అంటూ నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. నవ్యాంధ్ర ప్రగతిలో ప్రవాసాంధ్రులు కీలక పాత్ర పోషించాలని కోరారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో నాట్స్ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ, చికాగో సంబరాల సమన్వయకర్త రవి అచంటతో పాటు నాట్స్ ప్రతినిధులు రామానాయుడు సూర్యదేవర, మురళీకృష్ణ, శ్రీధర్ ముమ్మగండి, విశ్వప్రసాద్, శేషు బాబు, వినయ్ జొన్నలగడ్డ, కుటుంబరావు తదితరులున్నారు.