Must-look-after-China-says-US-military-general

‘చైనాతో ఎప్పటికైనా ప్రమాదమే’.. అమెరికా హెచ్చరిక..

వాషింగ్టన్: అమెరికాకు ఉన్న ఏకైక ప్రమాదం చైనాయేనని యూఎస్‌కు చెందిన ఓ టాప్ మిలటరీ జనరల్ అన్నారు. అమెరికా మంత్రులతో జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అమెరికా రక్షణ రంగంలో చైర్మన్ ఆఫ్ ద జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉన్న జనరల్ మార్క్ ఏ మిల్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే 50 లేదా 100 సంవత్సరాలలో అమెరికా ఎదుర్కొనే ఏకైక ప్రమాదం చైనాయేనని, అయితే చైనా ఏమీ యూఎస్‌కు శత్రువు కాదని ఆయన తెలిపారు. ఈ రెండు దేశాల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలను మెరుగుపరచాల్సి అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. వాణిజ్యాన్ని కూడా తమ మిలటరీ అవసరాలకు అనుగుణంగా చైనా ఉపయోగించుకుంటోందని, పాక్ మీదుగా వేస్తున్న అంతర్జాతీయ రహదారి కూడా దానిలో భాగమేనని అన్నారు. చైనాతో పోల్చుకుంటే అమెరికాకు ఉన్న అనుకూలతలను మర్చిపోకూడదన్నారు. తొలి గల్ఫ్ యుద్ధం, రెండో గల్ఫ్ యుద్ధాల్లో అమెరికా చర్యలను చైనా జాగ్రత్తగా పరిశీలించిందని, వాటిని తనకనుగుణంగా మార్చుకొని ఎన్నో ఫలితాలను రాబట్టిందని మిల్లీ అన్నారు. తూర్పు చైనా సముద్రం ఇప్పటికే చైనా దళాలతో నిండిపోయిందని, వారి వాయుసేన కూడా బలంగానే ఉందన్న ఆయన.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వాణిజ్య దారులు మూసుకుపోకుండా చూసుకోవాల్సిన బాద్యత అందరిపైనా ఉందన్నారు.