Murderer-raped-and-never-revealed-where-he-hid-the-body-got-legal-aid

‘ఆ నీచుడిని అలా వదిలేస్తారా?’.. హత్యాచారం చేసి శవం చిరునామా కూడా చెప్పలేదు.. ప్రభుత్వ సొమ్ముతోనే..

లండన్: అత్యాచారాలు, హత్యాచారాలు చేసే నిందితులకు భయం పుట్టేలా కఠినశిక్షలు విధించాలని ఓపక్క ప్రపంచం మొత్తం గగ్గోలుపెడుతుంటే.. బ్రిటన్‌లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జరిగిందో ఘటన. ప్రస్తుతం ఈ విషయం చాలామందిని ఆలోచనలో పడేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. బ్రిటన్‌కు చెందిన హెలెన్ మెక్‌కోర్ట్ బిలింగ్ ప్రాంతంలో నివశిస్తోంది. అక్కడే స్థానికంగా ఉండే ఇయాన్ సిమ్స్ ఆమెపై కన్నేశాడు. 22ఏళ్ల వయసున్న హెలెన్‌ను ఎవరికీ తెలియకుండా కిడ్నాప్ చేశాడు. ఆమెపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, ఆ తర్వాత చంపేశాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు హెలెన్ మృతదేహాన్ని ఎవరి కంటా పడకుండా దాచేశాడు. హెలెన్ కనిపంచడంలేదని ఆమె తల్లి మారీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 1988లో జరిగిన ఈ ఘటన దర్యాప్తులో పోలీసులకు లభించిన కొన్ని ఆధారాలను బట్టి ఇయానే ఈ ఘోరానికి పాల్పడినట్లు తేలింది. ఘటన జరిగిన ప్రాంతంలో ఇయాన్ డీఎన్‌ఏ కూడా దొరికినట్లు ఆధారాలు లభించాయి.

ఇన్ని సాక్ష్యాలు తనకు వ్యతిరేకంగా ఉన్నా ఇయాన్ చలించలేదు. తాను అమాయకుడినని, ఏమీ చేయలేదని బుకాయిస్తూనే వచ్చాడు. ఇయాన్‌ మాటలు నమ్మని కోర్టు అతనికి జైలుశిక్ష విధించింది. ఈ శిక్ష పూర్తికాకముందే అతనికి పెరోల్ మంజూరయింది. దీనికోసం 14వేల యూరోలు(రూ.11లక్షలపైగా) ప్రభుత్వం నుంచే అతను ఆర్థికసాయం పొందటం విశేషం. అతన్ని ఇలా పెరోల్‌పై విడుదల చేయడం అన్యాయమంటూ మారీ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా అతను నిజం ఒప్పుకొని హెలెన్ మృతదేహం ఎక్కడ దాచిందీ చెప్పాలని వేడుకొంది. ఇటువంటి నిందితులకు ఆర్థికసాయం అందజేసే విషయంలో లీగల్ ఎయిడ్ ఏజెన్సీలు కఠిన నియమాలు పాటించాలని కొత్తగా బ్రిటన్ పార్లమెంటులో ఓ చట్టం చేశారు. అయితే ఈ చట్టం చేయడానికి కొన్ని రోజుల ముందే పాత చట్టాల ప్రకారం ఇయాన్ విడుదలైపోయాడు.