mum-is-trying-to-kill-me-screams-boy-in-phonecall

‘అమ్మ నన్ను చంపేస్తోంది’.. ఫోన్‌లో ఆరేళ్ల బాలుడి కేకలు.. వెళ్లి చూస్తే..

నెవాడా: అమెరికాలోని నెవాడాలో అత్యవసర విభాగంలోని పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్‌లో మాట్లాడుతున్న మహిళ మాటలు వారికి సరిగా అర్థం కాలేదు. ఇంతలో ఆ మహిళ గొంతును డామినేట్ చేస్తూ.. ఓ పిల్లాడు ‘అమ్మ నన్ను చంపేస్తోంది. కాపాడండి’ అంటూ పెద్దగా అరిచాడు. ఆ కేకలు వినిపించిన వెంటనే ఫోన్‌కాల్ కట్ అయిపోయింది. దీంతో షాకైన పోలీసులు వెంటనే ఫోన్ వచ్చిన ఇంటికి వెళ్లి తలుపు కొట్టారు. ఎవరూ బయటకు రాకపోవడంతో తలుపులు బద్దలు కొట్టబోయారు. ఇంతలో తలుపులు తెరుచుకొని రక్తమోడుతున్న శరీరంతో ఓ ఆరేళ్ల పిల్లాడు బయటకు వచ్చాడు.

అది చూసి షాకైన పోలీసులు వెంటనే అతని గాయాలను పరిశీలించారు. ఆ బాలుడి శరీరంపై 25కత్తిపోట్లుండటంతో వారి నోటమాటరాలేదు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించిన పోలీసులు ఆ ఇంట్లోకి ప్రవేశించారు. అక్కడ కత్తి పట్టుకొని నగ్నంగా నిలబడి ఉన్న ఓ మహిళ వారిపై కూడా దాడికి దిగింది. లొంగిపోవాలని సూచించిన పోలీసులతో.. ‘నేను చచ్చినా అది జరగదు’ అని చెప్పింది. ఆ తర్వాత ఓ అధికారి గన్ను లాక్కొని వారిని కాల్చబోయింది. అప్పుడు రెండో అధికారి ఆమెను షూట్ చేసి చంపేశాడు. అక్టోబరు 22న జరిగిన ఈ ఘటనలో నిందితురాలిని క్లాడియా నదియా రోడ్రిగెజ్‌(37)గా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన బాలుడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడని తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఫొటోలను పోలీసులు ఇటీవలే విడుదల చేశారు.