Mum-gets-death-threats-for-breastfeeding-daughters

పిల్లలకు పాలిస్తుందని.. తల్లిని చంపేస్తామంటూ బెదిరింపులు..

ఒహాయో: అమెరికాకు చెందిన మెలిస్సా ఆస్ట్రాత్ అనే మహిళను చంపేస్తామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చాయి. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటో తెలుసా? తన పిల్లలకు పాలివ్వడమే. అదేంటి దానిలో తప్పేముంది అనుకుంటున్నారా? ఇక్కడే చిన్న ట్విస్టుంది. అదేంటంటే ఆమె పాలిస్తుంది పసివాళ్లకు కాదు. తన కుమార్తెలు నాలుగేళ్ల ఎమీలియా, రెండేళ్ల రెన్లీలకు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. పిల్లలిద్దరూ అడిగినప్పుడల్లా తాను పాలిస్తానని, వారు తాగినంతసేపు తాగనిస్తానని ఆమె పేర్కొంది.

దీన్ని చూసిన చాలామంది నెటిజన్లు ఆమె పిల్లలను చెడగొడుతోందని, వారి చేత బలవంతంగా అలా చేయిస్తోందని మండిపడుతున్నారు. పిల్లలు ఆహారం తినే స్థాయికి వచ్చిన తర్వాత పాలు పట్టాల్సిన అవసరం లేదని, మెలిస్సా చేస్తోంది తప్పని అన్నారు. దీనిపై స్పందించిన మెలిస్సా.. ‘సోషల్ మీడియాలో చాలా మంది నన్ను తప్పుబట్టారు. కొందరైతే చంపేస్తామన్నారు. అలాగని అందరూ అలానే లేరు. కొందరు నాకు మద్దతుగా కూడా నిలబడ్డారు. అందుకే నేను నాపని చక్కగా చేసుకుంటున్నా’ అని చెప్పింది.