Mum-dies-in-husbands-arms-on-their-dream-holiday

డ్రీమ్ హాలీడేకి వెళ్లి.. భర్త చేతుల్లోనే కన్నుమూసింది..

శాన్‌ఫ్రాన్సిస్కో: కుటుంబంతో కలిసి అమెరికా చూడాలనేది బ్రిటన్‌కు చెందిన జో విలియమ్స్ చిరకాల వాంఛ. అది తీరడానికి ఆమెకు చాలాకాలమే పట్టింది. ఎట్టకేలకు భర్త, కుమారుడితో కలిసి అక్టోబరు 26న శాన్‌ఫ్రాన్సిస్కో చేరుకుంది. కానీ ఆ కుటుంబ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. ట్రిప్ మొదలైన రెండో రోజే తనకు ఒంట్లో నలతగా ఉందని చెప్పిందామె. ఎప్పుడూ సంప్రదించే వైద్యులపై నమ్మకంతో స్వదేశంలోని వారిని ఫోన్‌లో సంప్రదించింది. తనది పెద్ద సమస్యకాదని వారు చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది. స్వదేశానికి తిరిగెళ్లగానే ఆస్పత్రికి వెళ్తానని భర్తకు మాటిచ్చింది. కానీ ఆ మరుసటి రోజు హోటల్ నుంచి బయటకు వచ్చి నాలుగడుగులు వేసిందో లేదో.. కళ్లు తిరిగి పడిపోయింది. ఆరోజు దగ్గరలో ఆస్పత్రులేవీ పనిచేయకపోవడంతో ఆమెను హోటల్‌లోనే ఉంచి భర్తే సపర్యలు చేశాడు.

కాసేపటికి కళ్లు తెరిచిన జో.. విమాన ప్రయాణం వల్ల తన శరీరం అలిసిపోయుంటుందని, తన కోసం కుమారుడి సంతోషాన్ని పాడుచేయొద్దని భర్తకు సూచించింది. వీల్‌చైర్ తెప్పించుకొని పట్టణంలో కొంతసేపు తిరిగింది. నవంబరు 2న తిరుగు ప్రయాణమయ్యే సమయంలో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ఆమె విమాన ప్రయాణం చేయడం మంచిది కాదన్న సిబ్బంది.. దగ్గరలోని ఓ హోటల్లో వాళ్లని దింపారు. అక్కడ ఉండగా అర్థరాత్రికి కళ్లు తెరిచిన జో.. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉందని భర్తకు చెప్పింది. ఆ మాటలు అతనికి కాళ్లూ చేతలూ ఆడలేదు. వెంటనే అంబులెన్సుకు ఫోన్ చేశాడు. కానీ ఆ అంబులెన్సు వచ్చేసరికి భర్త చేతుల్లోనే జో కన్నుమూసింది. ఈ విషయాన్ని చెప్పిన అతను..‘జోకు గతంలో గులియన్ బారె వ్యాధికి చికిత్స జరిగింది. తన ఒంట్లో బాగాలేకపోవడం దాని సైడ్‌ఎఫెక్టేనని అనుకున్నాం. కానీ ఆమె శరీరంలో రక్తం గడ్డకట్టడం వల్ల ఇలా జరిగిందని’ చెప్తూ చిన్నపిల్లాడిలా రోదించాడు. హోటల్ సిబ్బంది తమకు అండగా నిలిచారని చెప్పిన అతను.. వారికి కృతజ్ఞతలు తెలిపాడు. భార్య మృతదేహం తీసుకొని గురువారం స్వదేశం చేరుకున్న ఆ తండ్రీకొడుకులు.. జో అంత్యక్రియలు నిర్వర్తించారు.